
కోలీవుడ్ స్టార్ ధనుష్ రాజకీయ ఎంట్రీపై మరోసారి తెరపైకి వచ్చింది. ఇప్పటి వరకు ఈ హీరో అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ తమిళనాట జరుగుతున్న ప్రస్తుత పరిణామాలు మరింత ఉత్కంఠతను రేపుతున్నాయి. లేటెస్ట్ గా ధనుష్ అభిమాన సంఘం తీసుకున్న నిర్ణయం తమిళనాడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కోయంబత్తూరు జిల్లాలో ఏకంగా ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొత్త సంక్షేమ సంఘాలను ఏర్పాటు చేయాలని ఆల్ ఇండియా ధనుష్ ఫ్యాన్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్’ పిలుపునివ్వడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది.
కొత్త సంక్షేమ సంఘాలు..
లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ప్రకటనలో కోయంబత్తూరు నార్త్, కౌండంపాలయం, సింగనల్లూర్, సులూర్, మేట్టుపాళయం నియోజకవర్గాల్లో అభిమాన సంఘాలను విస్తరించాలని, సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలని సూచించారు. జిల్లా అధ్యక్షుడు జి. శంకర్ మార్గదర్శకత్వంలో కార్యక్రమాలను ముమ్మరం చేయాలని సంఘం జాతీయ కార్యదర్శి బి. రాజా పేర్కొన్నారు. ఈ ప్రకటనలో రాజకీయ పార్టీ, ఎన్నికలు, ప్రత్యక్ష రాజకీయ ప్రవేశంపై ఎలాంటి ప్రస్తావన లేకపోయినా.. నియోజకవర్గాల వారీగా కేడర్‌ను బలోపేతం చేయాలన్న ప్రయత్నం మాత్రం ఆసక్తిని రేపుతోంది.
ఇప్పుడే ఎందుకు?
అయితే ఇదంతా ఇప్పుడు ఎందుకు ? అన్న చర్చ కూడా తెరపైకి వచ్చింది. అయితే ఇటీవల అభిమానులు నిర్వహించిన రక్తదాన కార్యక్రమంలో ధనుష్ మాట్లాడుతూ.. అభిమానుల ఐక్యతను కేవలం సినిమా వేడుకలకే పరిమితం చేయకుండా ప్రజా సంక్షేమానికి ఉపయోగించాలని పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యల తర్వాతే పొలిటికల్ ఎంట్రీ రూమర్లు మరింత వేగం పుంజుకున్నాయి. గతంలో విజయ్ కూడా ఇలాగే అభిమాన సంఘాలను విస్తరించి చివరికి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. టీవీకే పార్టీని ఏర్పాటు చేసి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సీఎం పగ్గాలు చేపట్టారు. ఇప్పుడు ధనుష్ కూడా ఇదే తరహాలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా అన్న చర్చ నడుస్తోంది.
►ALSO READ | పుట్టిన గడ్డపైనే నా ఓటు తీసేశారు..గేమ్ మొదలైందంటూ ప్రకాశ్ రాజ్ వీడియో
ధనుష్ వ్యూహాం అదేనా?
తమిళనాడులో అభిమాన సంఘాల నుంచి రాజకీయ కేడర్‌ను నిర్మించుకున్న ఉదాహరణలు ఉండటంతో ధనుష్ కూడా అదే వ్యూహాన్ని అనుసరిస్తున్నారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే గతంలో ఫ్యాన్ క్లబ్ జెండాపై వచ్చిన రాజకీయ ప్రచారాన్ని ధనుష్ తండ్రి కస్తూరి రాజా, దర్శకుడు సుబ్రమణియం శివ ఖండించారు. కాబట్టి ప్రస్తుతానికి ఇది రూమర్ మాత్రమే.. అధికారిక ఎంట్రీ మాత్రం కాదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఒకవేళ ధనుష్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే.. విజయ్ టీవీకేకు పోటీగా అవుతుందేమో అన్న అభిమాప్రాయం కూడా తమిళనాట వ్యక్తం అవుతోంది.
వరుస సినిమాలతో ఫుల్ బిజీగా..
అయితే అభిమాన సంఘాల విస్తరణకు అసలు టార్గెట్ ఏంటి? సినిమా? సేవా కార్యక్రమాలా? లేక 2026 తర్వాతి తమిళనాడు రాజకీయాలా? ధనుష్ మౌనం మాత్రం ఇప్పుడు మరింత ఆసక్తిని పెంచుతోంది. మరోవైపు సినిమాల పరంగా ధనుష్ ఫుల్ బిజీగా ఉన్నారు. ‘ఓం: చాప్టర్ 1’, తమిళరసన్ పచముత్తుతో D56, మారి సెల్వరాజ్‌తో మరో ప్రాజెక్ట్, వెట్రిమారన్‌తో ‘తమిళ్ మురుగన్’ వంటి క్రేజీ ప్రాజెక్టులు ఆయన చేతిలో ఉన్నాయి.