Reading Time: < 1 minute

గాయాలు ఆటలో భాగమే.. నితీశ్‌‌ గాయాలపై లక్ష్మణ్‌‌ కీలక వ్యాఖ్యలు

Caption of Image.

బెంగళూరు: వరుస గాయాలతో ఇబ్బంది పడుతున్న టీమిండియా ఆల్‌‌రౌండర్‌‌ నితీశ్‌‌కుమార్‌‌ రెడ్డి ఫిట్‌‌నెస్‌‌పై బీసీసీఐ సెంటర్‌‌ ఆఫ్‌‌ ఎక్సలెన్స్‌‌ (సీఓఈ) హెడ్‌‌ వీవీఎస్‌‌ లక్ష్మణ్‌‌ స్పందించాడు. ఆల్‌‌రౌండర్‌‌గా బ్యాటింగ్‌‌, బౌలింగ్‌‌ రెండింటి కారణంగా నితీశ్‌‌పై అధిక వర్క్‌‌లోడ్‌‌ ఉంటుందని, దాన్ని సమర్థంగా నిర్వహించుకోవడంపై అతడితో నిరంతరం చర్చిస్తున్నట్లు తెలిపాడు. గాయాలు ఆటలో భాగమేనని పేర్కొన్నాడు. 

 ఇటీవల ఎడమ తొడ కండరాల గాయంతో నితీశ్‌‌ ఐర్లాండ్‌‌, ఇంగ్లండ్‌‌, జింబాబ్వేతో టీ20 సిరీస్‌‌లకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల గాయాలు, రిహాబిలిటేషన్‌‌ కార్యక్రమాలపై బీసీసీఐ సెక్రటరీ దేవజిత్‌‌ సైకియా ఆదివారం సీఓఈలో లక్ష్మణ్‌‌తో సమీక్షించారు. ఆటగాళ్ల రిహాబిలిటేషన్‌‌లో శారీరక ఫిట్‌‌నెస్‌‎తో పాటు మానసిక స్థితిపైనా ప్రత్యేక దృష్టి పెడుతున్నామని లక్ష్మణ్‌‌ తెలిపాడు. 

ప్రస్తుతం క్రికెటర్లకు ప్రత్యేకంగా ఆఫ్‌‌ సీజన్‌‌ దొరకడం లేదని, మ్యాచ్‌‌ల మధ్య లభించే విరామాలను ఫిట్‌‌నెస్‌‌ మెరుగుపరుచుకునేందుకు ఉపయోగించుకోవాలని సూచించాడు. సీజన్‌‌ ప్రారంభానికి ముందు కాంట్రాక్ట్‌‌, ఎంపిక చేసిన ఆటగాళ్లకు సమగ్ర ఫిట్‌‌నెస్‌‌ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు లక్ష్మణ్‌‌ వెల్లడించాడు.

 టీమిండియా స్ట్రెంత్‌‌ అండ్‌‌ కండిషనింగ్‌‌ కోచ్‌‌ అడ్రియన్‌‌ లీ రౌక్స్‌‌ సూచనతో కొత్తగా ‘బ్రాంకో టెస్ట్‌‌’ను ప్రవేశపెట్టామన్నాడు. యో-యో టెస్ట్‌‌తో పోలిస్తే దీన్ని సీజన్‌‌ మధ్యలోనూ నిర్వహించవచ్చని, ఆటగాళ్ల ఫిట్‌‌నెస్‌‌ స్థాయిని ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు ఇది ఉపయోగపడుతుందని వివరించాడు.

©️ VIL Media Pvt Ltd.