Reading Time: < 1 minute
కమ్యూనిటీ సెంటర్ టాయిలెట్‌లో షాకింగ్‌ సీన్..! అమానుష ఘటనతో హడలెత్తిపోయిన స్థానికులు

సంగారెడ్డి జిల్లా సదాశివపేట కమ్యూనిటీ సెంటర్ టాయిలెట్స్‌లో ఈ నెల 7వ తేదీన దారుణమైన దృశ్యం వెలుగు చూసింది. ఒక నవజాత శిశువు మృతదేహం లభ్యం కావడం తీవ్ర కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తులు ఆ పసికందును అత్యంత కిరాతకంగా కాలితో తొక్కి చంపేసిన ఆనవాళ్లు లభ్యమవ్వడం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆసుపత్రి సిబ్బంది సమాచారంతో సదాశివపేట పోలీసులు వెంటనే రంగంలోకి దిగి, క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరించారు. పోలీసులు, స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం..

సదాశివపేటలోని కమ్యూనిటీ సెంటర్‌ ప్రాంగణంలో ఉన్న టాయిలెట్స్‌లో ఈ నెల 7వ తేదీన ఓ నవజాత శిశువు మృతదేహం లభ్యమైంది. అయితే, కేవలం ఆ పసికందును అక్కడ పారవేయడమే కాకుండా, అత్యంత కిరాతకంగా కాలితో తొక్కి ప్రాణాలు తీసినట్లుగా ఆధారాలు కనిపించడంతో అక్కడి దృశ్యాన్ని చూసిన స్థానికులు, సిబ్బంది నివ్వెరపోయారు. టాయిలెట్లో శిశువు మృతదేహాన్ని గమనించిన ఆసుపత్రి సిబ్బంది వెంటనే సదాశివపేట పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, క్లూస్ టీమ్ సాయంతో క్షుణ్ణంగా పరిశీలించి కీలక ఆధారాలు సేకరించారు. కేసు తీవ్రత దృష్ట్యా ఈ ఉదంతంపై అత్యంత గోప్యంగా విచారణ చేపడుతున్నారు.

ఈ దారుణానికి ఒడిగట్టింది ఎవరు అనే కోణంలో పోలీసులు, వైద్య శాఖ ఉన్నతాధికారులు ఉమ్మడిగా దర్యాప్తు ముమ్మరం చేశారు. అసలు ఆ శిశువును కమ్యూనిటీ సెంటర్ టాయిలెట్లలోనే దారుణంగా హత్య చేశారా?
లేక వేరే ప్రాంతంలో ఎక్కడైనా చంపి, ఎవరికీ అనుమానం రాకుండా తెచ్చి ఇక్కడ పడేశారా? అనే సందేహాలపై ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగా కమ్యూనిటీ సెంటర్ పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అలాగే సమీప ఆసుపత్రుల్లో ఇటీవల ప్రసవించిన మహిళల వివరాలను, అనుమానితులను సేకరించి విచారిస్తున్నారు.

పురిటి నొప్పులు భరించి జన్మనిచ్చిన కన్నతల్లే ఈ దారుణానికి ఒడిగట్టిందా లేక అక్రమ సంబంధాలకు పుట్టిన బిడ్డ అని వదిలించుకున్నారా అనే కోణంలోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లోకంలోకి అడుగుపెట్టిన కొన్ని గంటలకే పసికందును ఇలా కాలితో తొక్కి చంపిన తీరు స్థానికంగా ప్రతి ఒక్కరినీ తీవ్రంగా కలిచివేస్తోంది.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..