Reading Time: < 1 minute

దగ్గుబాటి ఫ్యామిలీకి హైకోర్టు బిగ్ షాక్.. ‘డెక్కన్ కిచెన్’ కేసులో పిటిషన్ కొట్టివేత!

Caption of Image.

దగ్గుబాటి ఫ్యామిలీకి తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. హైదరాబాద్ , ఫిల్మ్‌నగర్‌లో ఉన్న ‘డెక్కన్ కిచెన్’ లీజు ప్రాపర్టీ వివాదంలో కీలక తీర్పునిచ్చింది.   నటులు దగ్గుబాటి వెంకటేష్, రాణా , నిర్మాత డి. సురేష్ బాబు, అభినవ్, అకౌంటెంట్ విశ్వనాథంలపై నమోదైన క్రిమినల్ కేసును కొట్టివేయడానికి న్యాయస్థానం నిరాకరించింది.  దీంతో ఈ కేసులో దిగువ కోర్టు క్రిమినల్ ప్రొసీడింగ్స్ కొనసాగనున్నాయి.

వివాదం ఎంటంటే?

ఫిల్మ్‌నగర్‌లోని డెక్కన్ కిచెన్‌కు సంబంధించిన లీజ్, స్థల స్వాధీనం, నిర్మాణాల కూల్చివేతే ఈ వివాదానికి కేంద్రబిందువు. వ్యాపారవేత్త కొరే నందు కుమార్ చేసిన ఫిర్యాదు ప్రకారం.. లీజ్‌లో ఉన్న ప్రాంగణంలోకి దగ్గుబాటి కుటుంబ సభ్యులు అక్రమంగా ప్రవేశించి, అక్కడి నిర్మాణాలను కూల్చివేయడంతో పాటు వస్తువులను తొలగించారని ఆరోపించారు. తనను, తన కుటుంబాన్ని బెదిరించినట్లు కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ వివాదం కొత్తది కాదు. 2018 నుంచే ఇరువర్గాల మధ్య లీజ్ హక్కులు, ఆస్తి స్వాధీనం విషయంలో వివాదం కొనసాగుతోంది. 2022 నవంబర్‌లో GHMC డెక్కన్ కిచెన్ నిర్మాణంలో కొంత భాగాన్ని కూల్చివేయడం అప్పట్లో హైకోర్టు వరకు వెళ్లింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో GHMC చర్యలపైనా తీవ్ర వ్యాఖ్యలు నమోదయ్యాయి.

దగ్గుబాటి ఫ్యామిలీకి షాక్..

లేటెస్ట్ గా  హైకోర్టులో దగ్గుబాటి కుటుంబం కీలక వాదన చేసింది. ఇది ప్రధానంగా సివిల్ వివాదమని, లీజ్ హక్కులు, పొజెషన్, నిర్మాణాల అంశాలపై జరుగుతున్న పోరాటాన్ని క్రిమినల్ కేసుగా కొనసాగించడం సరికాదని వాదించింది. అయితే జస్టిస్ ఎన్. తుకారాంజీ ఈ వాదనను అంగీకరించలేదు. ఒకే వివాదంలో సివిల్, క్రిమినల్ అంశాలు రెండూ ఉండొచ్చని, ఫిర్యాదులో నేరానికి సంబంధించిన అంశాలు  కనిపిస్తే కేవలం సివిల్ వివాదం ఉందనే కారణంతో క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను రద్దు చేయలేమని కోర్టు స్పష్టం చేసింది.

అయితే హైకోర్టు తీర్పు వెంకటేష్ లేదా రానా దోషులని తేల్చినట్లు మాత్రం కాదు. కేసును కేవలం ఈ దశలో ఆపకుండా, దిగువ కోర్టులో చట్టపరమైన ప్రక్రియ కొనసాగేందుకు మాత్రమే అనుమతించింది. ఇప్పుడు డెక్కన్ కిచెన్ వివాదంలో అసలు నిజానిజాలు విచారణలో తేలాల్సి ఉంది..

 

©️ VIL Media Pvt Ltd.