Reading Time: 2 minutes

కొత్తగా మరో 2 వేల అప్లికేషన్లు…అందుబాటులోకి ‘చేయూత’ వెబ్ పోర్టల్

Caption of Image.
  •     వితంతు పింఛన్‌‌‌‌కు తహసీల్దార్ సర్టిఫికెట్ మస్ట్​
  •     తొలిదశలో 50 వేల మంది దివ్యాంగులకు కొత్త పింఛన్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ  ప్రభుత్వం కొత్త పింఛన్లు మంజూరు చేస్తోంది. ‘చేయూత సామాజిక భద్రతా పింఛన్ పథకం’ కింద నూతన పింఛన్ల మంజూరుకు సంబంధించి విధివిధానాలను ఖరారు చేయడంతో అప్లికేషన్ల ప్రక్రియ ఊపందుకున్నది. కొత్త పింఛన్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘చేయూత’ వెబ్ పోర్టల్ సోమవారం నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు కొత్తగా మరో 2 వేల మంది వరకు దరఖాస్తులు సమర్పించారు. కొత్త పింఛన్లు కోసం లక్షలాది మంది దరఖాస్తు చేసుకోగా.. అవి పెండింగ్‌‌‌‌లో ఉన్నాయి. 

కాగా, వితంతు పింఛన్ కోసం తప్పనిసరిగా తహసీల్దార్ ధ్రువీకరణ పత్రం తీసుకోవాలని గ్రామీణాభివృద్ధి శాఖ మార్గదర్శకాల్లో పేర్కొంది. అంతేకాదు, ఒంటరి మహిళలు, వితంతువుల ఎంపిక ప్రక్రియలో మహిళా సంఘాలు కీలక భూమిక పోషించనున్నాయి. ఈ సారి చేయూత పథకంలో ఒంటరి మహిళలు, వితంతువులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఫైలేరియా బాధితులు, తలసేమియా, సికిల్‌‌‌‌సెల్ ఎనీమియా, హీమోఫీలియా వంటి రక్త సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారు, దివ్యాంగులకూ పెద్దపీట వేస్తున్నారు. కాగా, తొలిదశలో కొత్తగా 50 వేల మంది దివ్యాంగులకు పింఛన్లు మంజూరు చేయనున్నారు. 

ఆన్‌‌‌‌లైన్ స్క్రీనింగ్.. ఫీల్డ్ వెరిఫికేషన్ 

లబ్ధిదారులు చేయూత పోర్టల్ ద్వారా ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజల సౌకర్యార్థం ఎంపీడీవో కార్యాలయాలు, మండల సమాఖ్యలు, మున్సిపల్ కార్యాలయాలు, వార్డు ఆఫీసుల్లో ఆన్‌‌‌‌లైన్ దరఖాస్తు సదుపాయం కల్పించారు. దరఖాస్తు సమర్పించిన వెంటనే ఐటీ శాఖకు చెందిన ‘360 డిగ్రీ డేటాబేస్’ ద్వారా ప్రాథమిక పరిశీలన చేయనున్నారు. అంటే లబ్ధిదారులకు కారు ఉందా? వారింట్లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారా? ఇతర ఆదాయ వనరులు ఏమైనా ఉన్నాయా? అనేది పరిశీలిస్తారు. అనంతరం ఆయా ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హతలను నిర్ధారిస్తారు. 

అర్హుల జాబితాను ఆన్‌‌‌‌లైన్ ద్వారా డీఆర్‌‌‌‌డీవో లేదా హైదరాబాద్‌‌‌‌ హెడ్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌కు పంపుతారు. ఆమోదం తెలిపిన వెంటనే ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో మంజూరు ఉత్తర్వులు జారీ అయి, ప్రతినెలా లబ్ధిదారుల ఖాతాల్లో పింఛన్ డబ్బులు జమ అవుతాయి. ఈసారి ఏడు రకాల పింఛన్లకు మాత్రమే విధివిధానాలు ఖరారు చేయగా.. వృద్ధాప్య పింఛన్లకు సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. దీంతో వృద్ధులు ఆందోళన చెందుతున్నారు. వీరికి మరో విడతలో ఇస్తారా? లేదా? అనేది ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం పింఛన్‌‌‌‌దారుడు చనిపోయిన వెంటనే ఎలాంటి జాప్యం లేకుండా వారి జీవిత భాగస్వామికి పింఛన్ వర్తించేలా తక్షణ చర్యలు చేపట్టారు.  

©️ VIL Media Pvt Ltd.