Reading Time: < 1 minute
Hyderabad Panjagutta Crematorium Baby Body Missing Police Probe

Hyderabad: హైదరాబాద్‌లోని పంజాగుట్ట శ్మశానవాటికలో పూడ్చిపెట్టిన ఆరు నెలల పసికందు మృతదేహం అదృశ్యమైన ఘటన తీవ్ర కలకలం రేపింది. చార్మినార్ ఘాన్సీబజార్ ప్రాంతానికి చెందిన దంపతులకు ఆరు నెలల క్రితం కవల పిల్లలు జన్మించారు. అయితే తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆ పిల్లలకు బంజారాహిల్స్‌లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూ శనివారం ఓ పసికందు మృతి చెందడంతో, కుటుంబ సభ్యులు పంజాగుట్ట హిందూ శ్మశానవాటికలో మృతదేహాన్ని ఖననం చేశారు. అనంతరం ఆదివారం రాత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రెండో పసికందు కూడా పరిస్థితి విషమించి కన్నుమూసింది. సోమవారం రెండో పసికందు అంత్యక్రియలు నిర్వహించేందుకు శ్మశానవాటికకు వచ్చిన కుటుంబ సభ్యులకు ఎదురైన దృశ్యం షాక్‌కు గురిచేసింది. శనివారం మొదటి పసికందును పూడ్చిపెట్టిన చోట గుంత తీసి ఉండటాన్ని, గోతిలో మృతదేహం లేకపోవడాన్ని గమనించి దిగ్భ్రాంతి చెందారు. రెండో పసికందు అంత్యక్రియలు పూర్తి చేసిన అనంతరం, కుటుంబ సభ్యులు మొదటి పసికందు మృతదేహం మాయమైన వ్యవహారంపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. శ్మశానవాటికలోని కాటికాపరులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఈ సున్నితమైన ఘటనకు సంబంధించిన వివరాలను బంజారాహిల్స్ పోలీసులు ప్రస్తుతం గోప్యంగా ఉంచుతున్నారు.