Reading Time: < 1 minute
Nagababu Emotional Speech Korean Kanakaraju Mega Celebrations

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన Korean Kanakaraju బాక్సాఫీస్ వద్ద భారీ విజయంతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన మెగా బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్ వేడుకలో నటుడు నాగబాబు చేసిన కామెంట్స్ ప్రస్తుతం సినీ వర్గాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకలో నాగబాబు మాట్లాడుతూ మెగా కుటుంబం వెనుక ఉన్న అసలైన శక్తి గురించి గుర్తు చేసుకున్నారు. తామంతా ఈ స్థితిలో ఉన్నామంటే దానికి ప్రధాన కారణం మెగాస్టార్ చిరంజీవి అని కొనియాడారు. “మేమందరం ఈ స్టేజ్ మీద ఇలా ఉన్నామంటే మా అందరికీ ప్రాణవాయువు లాంటివాడు మా అన్నయ్య గారు. పవన్ కళ్యాణ్, నేను, చరణ్, వరుణ్, తేజు, వైష్ణవ్, నిహారిక.. ఇలా మేమందరం కూడా ఆయన ఆశీస్సులు, ఆయన ఇన్‌స్పిరేషన్ వల్లే ఈ స్థాయికి వచ్చాం. ఆయన మా జీవితంలో ఎప్పుడూ ఒక ఫాదర్ ఫిగర్” అంటూ ఎమోషనల్ అయ్యారు. వరుణ్ తేజ్‌తో ఉన్న చిన్ననాటి జ్ఞాపకాలను ఆయన ఈ సందర్భంగా నెమరువేసుకున్నారు.

వరుణ్ చిన్నతనంలో అన్నయ్య చిరంజీవి స్వయంగా ఎత్తుకుని పెంచారని, తాను చేసే ప్రతి సినిమా ప్రివ్యూకి వరుణ్‌ను ప్రత్యేకంగా తీసుకెళ్లేవారని గుర్తు చేసుకున్నారు. ఇంటి వద్ద వరుణ్ ఎప్పుడూ ఎంతో వినయంగా, విధేయతతో మెలుగుతాడని చెప్పారు. తను, వరుణ్ సాధారణ విషయాలు మాట్లాడుకున్నప్పటికీ, అన్నయ్యతో మాత్రం వరుణ్ ఫిలిం మేకింగ్, కెమెరా టెక్నిక్స్ వంటి లోతైన విషయాలపై సుదీర్ఘంగా చర్చిస్తుంటాడని తెలిపారు. అన్నయ్య కూడా వరుణ్‌ను అంత ఆప్యాయంగా గమనిస్తూ, ఇంట్రెస్ట్‌గా విషయాలు చెబుతుంటారని తెలిపారు.కుటుంబంలో ఎవరికి ఏ చిన్న సమస్య వచ్చినా చిరంజీవి ముందుండి పరిష్కరిస్తారని, తాము మర్చిపోయినా ఆయనే స్వయంగా గుర్తుపెట్టుకుని అండగా నిలుస్తారని నాగబాబు తెలిపారు. చిరంజీవి ఆశీస్సులు, పవన్ కళ్యాణ్ బలం వెన్నెముకగా ఉన్నంత కాలం తాము పరిశ్రమలో మంచి విజయాలు సాధించగలమన్న నమ్మకం ఉందని పేర్కొన్నారు.