Reading Time: < 1 minute
Rahul Gandhi Pm Modi Iran Us War Pakistan Mediator India Foreign Policy

Rahul Gandhi: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్రమోడీ టార్గెట్‌గా తీవ్ర విమర్శలు చేశారు. ఇరాన్ యుద్ధం విషయంలో పాకిస్తాన్ మధ్యవర్తిగా వ్యవహరిస్తుంటే, భారత్ మాత్రం పక్కన నిలబడి చూస్తోందని ఆరోపించారు. ఇరాన్, అమెరికాలు భారత్‌కు మిత్రదేశాలే అని, ఈ సంబంధాలను ఉపయోగించుకుని యుద్ధం ముగింపులో కీలక పాత్ర పోషించే అవకాశాన్ని భారత్ కోల్పోయిందని అన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ నేషనల్ కన్వెన్షన్‌లో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇరాన్ యుద్ధ సమయంలో ఇందిరాగాంధీ వంటి బలమైన నాయకత్వం ఉంటే భారత్‌కు ప్రపంచంలోనే అతిపెద్ద అవకాశంగా మారేది, కానీ పాక్ మధ్యవర్తిగా మారిందని, మోడీజీ పక్కన నిలబడి చూస్తున్నారని రాహుల్ అన్నారు. ఇరాన్ భారత్‌కు పాత మిత్రదేశమే అని, రష్యా, అమెరికాలు కూడా మిత్రదేశాలే అని ఆయన పేర్కొన్నారు. ఈ సంబంధాలను ఉపయోగించుకుంటే భారత్ ప్రభావవంతమైన పాత్ర పోషించేదని చెప్పారు.

రాహుల్ గాంధీ చైనా సరిహద్దు అంశంలోనూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారత సైనికులు గస్తీ నిర్వహించకుండా చైనా బలగాలు అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. ప్రధాని మోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షాలు పూర్తిగా నీరసించిపోయారని విమర్శించారు. గాల్వాన్ ఘర్షణల్ని ప్రస్తావిస్తూ, భారత్ భూభాగం కోల్పోలేదని ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యల్ని చైనా చర్చల్లో ఉపయోగించుకుంటోందని ఆరోపించారు.

ప్రధాని మోడీకి ఇకపై రాత్రిళ్లు నిద్ర లేకుండా చేస్తామని హెచ్చరించారు. పార్లమెంట్ సమావేశాలకు అమిత్ షా రాలేదని ఎద్దేవా చేశారు. ఆర్ఎస్ఎస్‌పై పెద్ద వ్యాపార సంస్థల ప్రభావం ఉందని ఆరోపించారు. నోట్ల రద్దు, జీఎస్టీ వంటి విధానాలు ఆర్ఎస్ఎస్ సంప్రదాయ మద్దతుదారులైన చిన్న వ్యాపారుల్ని దెబ్బతీసిందని ఆనరోపించారు.