
టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 12న తన రాజీనామాను సమర్పించిన ఆయన.. ప్రస్తుత పదవీకాలం పూర్తయ్యే వరకు కొనసాగుతారు. ఆ తర్వాత మరోసారి చైర్మన్‌గా నియమించుకోవాలని కోరుకోవడం లేదని సమాచారం. ఆగస్టు 18న జరగనున్న టాటా సన్స్ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన పునర్నియామకంపై షేర్‌హోల్డర్లు ఓటు వేయాల్సి ఉంది. అయితే అంతకుముందే చంద్రశేఖరన్ తన నిర్ణయాన్ని ప్రకటించడం కార్పొరేట్ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. అసలు కంపెనీలో ఏం నడుస్తోంది, రతన్ టాటా మరణం తర్వాత జరుగుతున్న గొడవలపై అందరి దృష్టి కొనసాగుతోంది.
చంద్రశేఖరన్ 1987లో టాటా గ్రూప్‌లో చేరారు. 2009లో TCS సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం 2017లో టాటా సన్స్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. టాటా గ్రూప్ వ్యవస్థాపక కుటుంబానికి చెందిన వ్యక్తి కాకుండా, వారసుడు కూడా కాకుండా ఇంత పెద్ద భారతీయ వ్యాపార సామ్రాజ్యానికి నాయకత్వం వహించిన తొలి వ్యక్తిగా చంద్రశేఖరన్ గుర్తింపు పొందారు. దివంగత రతన్ టాటా స్వయంగా చంద్రశేఖరన్‌ను చైర్మన్‌గా ఎంపిక చేశారు.
అయితే ఆయన పునర్నియామకంపై కొంతకాలంగా టాటా ట్రస్ట్స్‌తో విభేదాలు కొనసాగుతున్నాయి. ఫిబ్రవరిలో చంద్రశేఖరన్‌కు 3వ సారి పదవీకాలం ఇవ్వడంపై నిర్ణయం తీసుకోవాల్సిన బోర్డు సమావేశం వాయిదా పడింది. టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటా.. టాటా సన్స్ అప్పుల నియంత్రణ, సంస్థను స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ చేయకపోవడం, షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌తో ఉన్న సమస్యల పరిష్కారంపై స్పష్టత కోరినట్లు సమాచారం.
ALSO READ : శ్రావణమాసం ముందు చుక్కలు చూపిస్తున్న గోల్డ్ రేటు..
ఇదే సమయంలో టాటా సన్స్ బోర్డులో ప్రాతినిధ్యం, వ్యూహాలు, షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌లోని మైనారిటీ వాటా తదితర అంశాలపై టాటా సన్స్, టాటా ట్రస్ట్స్ మధ్య విభేదాలు వెలుగులోకి వచ్చాయి. మరోవైపు సర్ రతన్ టాటా ట్రస్ట్ ట్రస్టీ విజయ్ సింగ్ కూడా తన పదవీకాలం ముగియకముందే తిరిగి నియమించుకోవద్దని కోరుతూ తప్పుకున్నారు. ఈ పరిణామాలతో టాటా సన్స్ తదుపరి నాయకత్వంపై ఆసక్తి పెరిగింది. సెమీకండక్టర్ తయారీ వంటి భారీ ప్రాజెక్టుల్లో అడుగులు వేస్తున్న టాటా గ్రూప్ భవిష్యత్ వ్యూహాలపై చంద్రశేఖరన్ నిర్ణయం ప్రభావం చూపే అవకాశం ఉంది.