
- ఓట్ల తొలగింపును అడ్డుకోవాలి
- నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో పలు తీర్మానాలు
నిర్మల్, వెలుగు: జిల్లాలో ప్రధాన సమస్యగా ఉన్న పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, ఎస్ఐఆర్ ప్రక్రియలో అర్హులైన ఓట్లు తొలగిపోకుండా చర్యలు తీసుకోవాలని నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ అన్నారు. మంగళవారం నిర్మల్‌లోని ఓ హోటల్లో నిర్వహించిన జిల్లా కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో పలు కీలక అంశాలపై తీర్మానాలు చేశారు. అర్హులైన ఓటర్ల ఓట్లు భారీగా తొలగిపోకుండా కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని నిర్ణయించింది. జిల్లాలో పూర్తిస్థాయిలో బూత్ కమిటీలను ఏర్పాటు చేసి పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలని తీర్మానించారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి శాశ్వత జిల్లా కార్యాలయ భవనాన్ని నిర్మించేందుకు చర్యలు చేపట్టాలని, వెంటనే అనువైన స్థలాన్ని ఎంపిక చేయాలని నిర్ణయించారు. పీఏసీఎస్, ఎఫ్‌ఏసీఎస్ చైర్మన్‌ల ఎన్నికల్లో సామాజిక న్యాయానికి ప్రాధాన్యం ఇవ్వాలని సమావేశం తీర్మానించింది. జిల్లాలో దీర్ఘకాలంగా ఉన్న పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని తీర్మానించారు. సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలచారి, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు శ్రీహరి రావు, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అర్జుమంద్, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గణేశ్ చక్రవర్తి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.