Reading Time: < 1 minute
Balakrishna Koratala Siva Movie Cancelled Budget Reason Nbk112

NBK112: నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కాల్సిన క్రేజీ ప్రాజెక్ట్‌పై ప్రస్తుతం టాలీవుడ్‌లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ టైంలోనే కొరటాల శివ దర్శకత్వంలో సినిమా ప్రారంభమైంది. ఘనంగా ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్‌పై తాజాగా సోషల్ మీడియా వేదికగా పలు కథనాలు ప్రచారం అవుతూ, అభిమానుల్లో అనుమానాలు వ్యక్తం అయ్యేలా చేస్తున్నాయి. బాలయ్య తన కెరీర్‌లో కథ, పాత్రతో పాటు సినిమా బడ్జెట్ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల టాక్. ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాలతో వచ్చే రిస్క్‌ను తగ్గించుకోవాలని ఆయన భావిస్తున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

గతంలో గోపీచంద్ మలినేని చెప్పిన ఓ హిస్టారికల్ కథకు భారీ బడ్జెట్ అవసరమవుతుందని భావించి బాలయ్య దాన్ని పక్కన పెట్టి, వేరే కథతో సినిమా చేస్తున్నట్లు సమాచారం. సుమారు రూ.200 కోట్ల బడ్జెట్‌తో హిస్టారికల్ ప్రాజెక్ట్ తెరకెక్కాల్సి ఉండగా.. రూ.100 కోట్ల పరిధిలోనే ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న కథకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. అయితే కొరటాల శివ సినిమాను మాత్రం సుమారు రూ.150 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించనున్నట్లు ప్రారంభ సమయంలో నిర్మాతలు వెల్లడించడంతో అప్పట్లోనే పలు సందేహాలు వ్యక్తమయ్యాయి. తాజాగా అదే బడ్జెట్ అంశం కారణంగా బాలకృష్ణ ఈ ప్రాజెక్ట్ నుంచి వెనక్కి తగ్గినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు కొరటాల శివ తదుపరి ఎన్టీఆర్‌తో ‘దేవర 2’ను తెరకెక్కించే అవకాశంపైనా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘డ్రాగన్’ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఇటీవల గాయమైన సర్జరీ చేయించుకున్న ఎన్టీఆర్ పూర్తిగా కోలుకుని తిరిగి ‘డ్రాగన్’ సెట్స్‌‌లోకి అడుగు పెట్టి త్వరగా ఆ ప్రాజెక్ట్ పూర్తి చేసిన తర్వాతనే దేవర 2 పై స్పష్టత వచ్చే అవకాశం ఉందని సమాచారం. దీంతో బాలయ్య – కొరటాల సినిమా పరిస్థితి ఏంటి? కొరటాల తదుపరి అడుగు ఎటు? అనేది తెలియాలంటే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.