అనంత విశ్వం మరోసారి తన అద్భుత రూపాన్ని ఆవిష్కరించేందుకు సిద్ధమైంది. ఈరోజు ఆగష్టు 12 న అంతరిక్షంలో ఒకే రోజు మూడు అరుదైన ఖగోళ ఘట్టాలు సంభవించబోతున్నాయి. ఆరు గ్రహాల ప్లానెట్ పరేడ్, పెర్సీడ్స్ ఉల్కాపాతం, మరియు సంపూర్ణ సూర్యగ్రహణం ఒకే రోజు రావడం ఖగోళ శాస్త్రవేత్తలను ఆకాశ ప్రేమికులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ మూడింటి ప్రత్యేకతలేంటో వివరంగా తెలుసుకుందాం.
ఆరు గ్రహాల ప్లానెట్ పరేడ్: సూర్యోదయానికి ముందే ఆకాశంలో ఒక అద్భుతం జరగనుంది. గురుడు, బుధుడు, అంగారకుడు, శని, యురేనస్ మరియు నెప్ట్యూన్ అనే ఆరు గ్రహాలు ఒకే వరుసక్రమంలోకి వస్తున్నట్లు కనిపిస్తాయి. దీనినే “ప్లానెటరీ పరేడ్” అంటారు. ఇక వీటిలో గురుడు, శని వంటి గ్రహాలను నేరుగా కంటితోనే చూడవచ్చు, కానీ యురేనస్, నెప్ట్యూన్‌లను చూడటానికి టెలిస్కోప్ లేదా బైనాక్యులర్స్ అవసరమవుతాయి.

కాంతివంతమైన పెర్సీడ్స్ ఉల్కాపాతం: రెండవ అద్భుతం పెర్సీడ్స్ ఉల్కాపాతం. ‘స్విఫ్ట్-టట్లీ’ అనే తోకచుక్క వదిలివెళ్లిన వ్యర్థాలు భూ వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు ఘర్షణకు గురై మెరుస్తాయి. ఇవి ఆకాశంలో కాంతివంతమైన గీతల్లా కనువిందు చేస్తాయి. ఇక రేపు అమావాస్య కావడంతో వెన్నెల వెలుగుల అంతరాయం లేక, నల్లటి ఆకాశంలో ఈ ఉల్కాపాతం అత్యంత స్పష్టంగా మరియు ప్రకాశవంతంగా కనిపించనుంది.
సంపూర్ణ సూర్యగ్రహణం: ఇక మూడవ విశేషం సంపూర్ణ సూర్యగ్రహణం. చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పివేసే ఈ ఘట్టం రేపే సంభవించనుంది. అయితే, ఇది భారతదేశంలో సంభవించే సమయానికి రాత్రి కావడం వల్ల మన దేశంలో కనిపించదు. ఇక ఇతర దేశాల్లోని ఖగోళ ప్రేమికులు దీనిని వీక్షించవచ్చు.
ఒకే రోజున గ్రహాల వరుసక్రమం, ప్రకాశవంతమైన ఉల్కాపాతం, మరియు సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించడం అత్యంత అరుదైన విషయమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నక్షత్రాల వైపు చూసే ప్రతి ఒక్కరికీ ఈ రోజు ఒక గొప్ప అనుభూతిని ఇస్తుంది.
గమనిక: సూర్యగ్రహణాన్ని నేరుగా కంటితో చూడకూడదు, కానీ ఉల్కాపాతం మరియు ప్లానెట్ పరేడ్‌ను సురక్షితంగా వీక్షించవచ్చు. గ్రామీణ లేదా చీకటి ప్రాంతాల నుంచి చూస్తే ఈ దృశ్యాలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి.
The post ఆకాశంలో అరుదైన దృశ్యాలు.. ఈరోజు ఒకేసారి 3 అద్భుతాలు! appeared first on Manalokam – Latest Telugu News & Updates.