జగిత్యాల జిల్లా లో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండ గట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం హుండీలో డమ్మీ 500 నోట్లు కనబడడం సంచలనంగా మారింది. సుమారుగా రెండు లక్షల 50 వేల డమ్మీ నోట్లను గుర్తు తెలియని వ్యక్తులు హుండీలో వేసినట్లు స్థానిక అధికారులు గుర్తించారు. వెంటనే ఈ హుండీలో నుంచి ఆ డమ్మీ నోట్లోనే తీసి పక్కకు పెట్టారు.
ఎవరో కావాలనే డమ్మీ నోట్లు హనుమాన్ హుండీలో వేసినట్లు అధికారులు భావిస్తున్నారు. ఇలా ఎందుకు వేసి ఉంటారనే కోణంలో విచారణ చేపడుతున్నారు. అంతేకాకుండా ఈ నాలుగు ఐదు రోజుల్లో సిసి ఫుటేజ్ ని కూడా పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు అయితే ఆ డమ్మీ నోట్లువేసిన వ్యక్తిని గుర్తుపట్టలేదు.
అయితే హుండీ భద్రత పైన భక్తుల్లో కలవరం మొదలైంది. హుండీ సమీపంలో సీసీ కెమెరాలు ఉండడంతో, ఈ వ్యక్తిని గుర్తుపట్టే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఎప్పుడు రద్దీగా ఉండే ఈ ఆలయంలో కావాలనే డమ్మీ నోట్లు వేశారని తెలుస్తుంది. అయితే.. హుండీ ని పూర్తిస్థాయిలో లెక్కించిన తర్వాత.. ఈ డమ్మీ వ్యవహారం పైన పోలీసులకు ఫిర్యాదు చేస్తామని దేవస్థానం అధికారులు చెబుతున్నారు.
మొట్ట మొదటిసారిగా హుండీలో డమ్మీ 500 నోట్లు రావడం కలకలంగా మారింది. ఈ విధంగా హుండీలో 500 డమ్మీ నోట్లు వేసి. భక్తుల మనోభావాలను దెబ్బతీశారని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
అధికారులు తక్షణమే స్పందించి.. డమ్మీ నోట్లు వేసిన వ్యక్తుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. అదేవిధంగా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.




