Reading Time: < 1 minute
Jr Ntr Shoulder Surgery Successful Kims Hospital Health Bulletin
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (N.T.R) భుజానికి ఇటీవల గాయమవ్వడంతో సికింద్రాబాద్‌లోని కిమ్స్ (KIMS) ఆస్పత్రిలో ఆయనకు ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ విజయవంతంగా పూర్తయింది. ఈ మేరకు ఆస్పత్రి యాజమాన్యం అధికారిక హెల్త్ బులెటిన్ విడుదల చేస్తూ కీలక విషయాలను వెల్లడించింది. ఎన్టీఆర్ భుజం గాయం త్వరగా, సంపూర్ణంగా నయం కావడానికి శస్త్రచికిత్స అవసరమని నిపుణులైన వైద్యుల బృందం నిర్ణయించింది. డాక్టర్ ఆర్. ఎ. పూర్ణచంద్ర తేజస్వి, డాక్టర్ నితిన్ బెజ్జంకి, డాక్టర్ మధుసూదన్ రావు మరియు డాక్టర్ శ్రీనివాస్ రావు సురపనేని నేతృత్వంలోని ఆర్థోపెడిక్ సర్జన్ల బృందం ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించింది. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆయన పూర్తి క్షేమంగా ఉన్నారని వైద్యులు స్పష్టం చేశారు.
వైద్యుల పర్యవేక్షణలో ఎన్టీఆర్‌కు త్వరలోనే ప్రత్యేక పునరావాస కార్యక్రమాన్ని (రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్) ప్రారంభించనున్నారు. ఆయన దాదాపు 2 నుండి 3 నెలల వ్యవధిలో సంపూర్ణంగా కోలుకుని, సాధారణ స్థితికి వస్తారని డాక్టర్లు అంచనా వేస్తున్నారు. కిమ్స్ ఆస్పత్రి మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ సంబిత్ సాహు సంతకంతో ఈ ప్రకటన విడుదలైంది. ఎన్టీఆర్ ఆరోగ్యం మెరుగ్గా ఉందన్న వార్తతో ఆయన అభిమానులు, సినీ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి.