Reading Time: 2 minutes
Off The Record Over Balineni Srinivas Vs Damacharla Janardhan

ఒంగోలు గిత్తల పోట్లాట కూటమి రాజకీయాన్ని ఎలాంటి మలుపు తిప్పబోతోంది? అది ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరుగానే ఆగుతుందా? లేక కూటమి సంబంధాలపై ప్రభావం చూపుతుందా? ప్రెసిడెంట్‌గారి టైం తీసుకుని వచ్చి కలవండని జనసేన హెడ్డాఫీస్‌ నుంచి బాలినేనికి కాల్ వచ్చింది నిజమేనా? ఆయనకు పవన్‌ మునుపటిలాగే స్వేచ్ఛ ఇస్తారా? లేక దూకుడుకు బ్రేకులేస్తారా? ప్రెసిడెంట్‌ కాలింగ్‌ ఎపిసోడ్‌ గురించి పార్టీలో జరుగుతున్న చర్చలేంటి? ప్రకాశం జిల్లా రాజకీయాల్లో మరోసారి కూటమి కాక రేగుతోంది. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌పై జనసేన సీనియర్‌ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన తీవ్ర ఆరోపణలు కూటమి పార్టీల మధ్య అగ్గి భగ్గుమనేలా చేస్తున్నాయి. అదే సమయంలో… ఇప్పటి వరకు బాలినేని విషయంలో సాఫ్ట్‌ కార్నర్‌తో ఉన్న జనసేన అధినేత.. తాజా పరిణామాలపై ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. బాలినేని పార్టీకి బలమా? లేక భారమా? అన్న చర్చ జనసేన వర్గాల్లో జరుగుతున్నట్టు సమాచారం. ఒకటి రెండు కాదు, ఒంగోలు నియోజకవర్గంలో జరుగుతున్న అన్ని రకాల అక్రమాలకు దామచర్లే కర్త, కర్మ, క్రియ అంటూ తీవ్ర వ్యాఖ్యలే చేశారు బాలినేని. అంతేకాదు… దామచర్ల బాధితులకు తాను అండగా ఉంటానని ప్రకటించారాయన. అదే ఊపులో…. వచ్చే ఎన్నికల్లో తనతో పాటు తన కుమారుడు కూడా పోటీ చేస్తాడనిశ్రీనివాసరెడ్డి చేసిన ప్రకటన కూటమి వర్గాల్లో మరింత కలకలానికి కారణమైంది. అసలా సంగతిని పవన్‌కళ్యాణ్‌తో చర్చించే ప్రకటించారా అంటూ జనసైనికులే ఆశ్చర్యపోయారట. ఇక బాలినేని ఆరోపణలపై దామచర్ల కూడా ఎదురుదాడికి దిగారు. కూటమిలో విభేదాలు తీసుకురావడానికే అలాంటి ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారాయన. అయితే ఇది ఒక్కరోజు వివాదం కాదు. బాలినేని జనసేనలో చేరినప్పటి నుంచి ఒంగోలు కూటమిలో విభేదాలు మొదలయ్యాయి. మొదట జనసేన నేతలు వర్సెస్‌ బాలినేని అన్నట్టుగా సాగిన వివాదం.. క్రమంగా రూపు మార్చుకుంది. పరిస్థితి అదుపు తప్పడంతో ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన కమిటీ మొత్తాన్ని పార్టీ అధిష్టానం రద్దు చేసింది. ఆ చర్యతో బాలినేనికే పార్టీ అధిష్టానం మద్దతు పలికినట్టు అయ్యింది.

ఆ తర్వాత బాలినేని, చంద్రబాబు భేటీ తర్వాత ఇక అంతా సర్దుకుపోతుందని అనుకున్నారు. ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఎవరి పరిధిలో వారు పనిచేసుకుంటారని భావించారు. కానీ ఇప్పుడు మరోసారి దామచర్లపై బాలినేని బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు.. టీడీపీ-జనసేన మధ్య ఆధిపత్య పోరు తగ్గలేదన్న సంగతిని చెప్పకనే చెబుతున్నాయి. టీడీపీ లీడర్స్‌ మీద జనసేన నేతలు బహిరంగంగా విమర్శలు చేస్తే పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ తీవ్రంగా స్పందిస్తుంటారు. పొత్తుకు ఇబ్బంది కలిగేలా వ్యవహరించొద్దని ఆయన హెచ్చరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కూటమి నిర్ణయాలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే పార్టీ నుంచి బయటకు వెళ్లవచ్చంటూ గతంలోనే పవన్‌ హెచ్చరించారు పవన్‌. ఈ పరిస్థితుల్లో… ఇప్పుడు బాలినేని విషయంలో పవన్‌ వైఖరి ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. శ్రీనివాసరెడ్డి అంటే… పవన్‌కు ప్రత్యేకమైన అభిమానం ఉందన్న సంగతి చాలాసార్లు బయటపడింది. వైసీపీలో ఉన్నప్పుడు కూడా బాలినేని రాజకీయ వైఖరిని పవన్‌ ప్రశంసించారు. జనసేనలో కూడా ఇప్పుడాయనకు మంచి రోల్ ఇచ్చారు. అలాంటి సమయంలో పార్టీలైన్‌కు విరుద్ధంగా… టీడీపీ ఎమ్మెల్యేపై బహిరంగంగా తీవ్ర ఆరోపణలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే సమయంలో.. తాజాగా వివాదంపై బాలినేనికి జనసేన పెద్దల నుంచి ఫోన్‌ వెళ్లింది. ప్రెసిడెంట్ గారి సమయం తీసుకుని వచ్చి కలవండని సూచించారట. అటు దామచర్ల జనార్దన్‌కు కూడా టీడీపీ పెద్దలు నుంచి పిలుపు వచ్చిందంటున్నారు. దీన్నిబట్టి చూస్తుంటే… ఈ ఎపిసోడ్‌ని రెండు పార్టీల అధిష్టానాలు సీరియస్‌గానే తీసుకున్నట్టు కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. త్వరలోనే కూటమి సమన్వయ కమిటీ ముందుకు ఇద్దర్నీ పిలిచి సమస్యకు పరిష్కారం చూపే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలిసింది. అయితే ఇప్పుడు అసలు ప్రశ్న ఒక్కటే….. ఇప్పటి వరకు బాలినేనికి అన్‌కండిషనల్‌గా మద్దతు తెలిపిన పవన్‌కళ్యాణ్‌… ఇక మీదట కూడా అలాగే ఉంటారా? లేక దూకుడుకు బ్రేకులు వేస్తారా? అన్నది ఇంట్రస్టింగ్‌ పాయింట్‌. ఒంగోలు వివాదం కేవలం ఇద్దరు నేతల మధ్య గొడవగానే ముగుస్తుందా.. లేక కూటమి రాజకీయాలపై ప్రభావం చూపిస్తుందా? అంటూ చర్చలు జరుగుతున్నాయి రాజకీయవర్గాల్లో.