Reading Time: < 1 minute

గ్రాఫిక్స్ అన్నవాళ్లే తలదించుకునేలా అమరావతి: సీఎం చంద్రబాబు

Caption of Image.

ఏపీ రాజధాని అమరావతికి రాజమార్గమైన సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించారు సీఎం చంద్రబాబు. గురువారం ( ఆగస్టు 13 ) జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు. అమరావతి రాజధాని రాజమార్గమైన సీడ్ యాక్సెస్ రోడ్ అందుబాటులోకి వచ్చేసిందని.. నగర నిర్మాణంలో ఇది ప్రారంభం మాత్రమేనని అన్నారు. మూడో దశలో ఇది తాడేపల్లి దగ్గర జాతీయ రహదారికి కనెక్ట్ అవుతుందని అన్నారు చంద్రబాబు. కొంతమంది అమరావతిని గ్రాఫిక్స్ అంటూ ఎగతాళి చేశారని.. ఇప్పుడు ఆ గ్రాఫిక్స్ నిజమవుతుంటే వాళ్ళు తలదించుకుంటున్నారని ఎద్దేవా చేశారు చంద్రబాబు.

అమరావతి రాజధాని పూర్తి కాలుష్య రహిత నగరంగా మారుతుందని… డీప్ టెక్ క్యాపిటల్ గా దీనిని తయారు చేస్తున్నామని అన్నారు. ఏఐ, క్వాంటం కంప్యూటర్ వ్యాలీగా అమరావతి మారుతుందని… టాప్ 5 నగరాల్లో ఒకటిగా తయారవుతుందని అన్నారు చంద్రబాబు. అమరావతి, మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు, విజయవాడ కార్పొరేషన్లు రాజధాని పరిధిలోనే ఉంటాయని.. 190 కిలోమీటర్ల అవుటర్, 96 కిలోమీటర్ల ఇన్నర్ రింగురోడ్డును కూడా కేంద్రం మంజూరు చేసిందని అన్నారు చంద్రబాబు.

2028 నాటికి భారత్ మెచ్చిన రాజధానిగా అమరావతిని ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభిస్తామని.. సింధూ నాగరికత తరహాలోనే రాజధాని నగరంలో సీడ్ యాక్సెస్ రహదారులు నిర్మాణం జరుగుతున్నాయని అన్నారు. ఇక అమరావతి అన్ స్టాపబుల్. రాజధాని లో నిర్మిస్తున్న రోడ్డును అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నించారని.. ఈ తరహా వ్యక్తులతో రాష్ట్రానికి చాలా ప్రమాదమని అన్నారు. 

రాష్ట్రాభివృద్ధి కోసం నిర్దిష్టమైన లక్ష్యాలను పెట్టుకుంటున్నామని… 2047 నాటికి ఏపీని  స్వర్ణాంధ్ర చేయాలన్న సంకల్పం తీసుకున్నామని అన్నారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని చేతిలో జాతీయ జెండా, మనస్సులో అజెండాతో సాధించాల్సిన లక్ష్యాన్ని సంకల్పం చేయండని ప్రజలకు పిలుపునిచ్చారు చంద్రబాబు.

2047 నాటికి స్వర్ణాంధ్రగా ఏపీ తయారు కావాలని… ఆ శక్తి సామర్ధ్యాలను ప్రజలే అందించాలని అన్నారు. అమరావతి రాజధాని అభివృద్దికి ప్రజలూ ఆలోచనలు పంచుకోవాలని అన్నారు చంద్రబాబు. అమరావతి ఆర్ధిక రాజధానిగా మారాలని… స్వాంతంత్ర్య దినోత్సవ స్పూర్తిని ప్రజలంతా అందిపుచ్చుకోవాలని అన్నారు చంద్రబాబు.

©️ VIL Media Pvt Ltd.