
- అధికారులపై చర్యలు తీసుకోవాలని దివ్యాంగుడి డిమాండ్
శంకరపట్నం, వెలుగు: సాధారణంగా లబ్ధిదారు మృతిచెందిన తర్వాత ఒకటి, రెండు నెలలకు ఆసరా పింఛన్ నిలిపివేస్తారు. కానీ కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మెట్టుపల్లి గ్రామంలో ఓ దివ్యాంగ పెన్షన్‌దారుడు బతికుండగానే మృతి చెందినట్లు అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసి పింఛన్ నిలిపివేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మెట్టుపల్లి గ్రామానికి చెందిన తోట శ్రీనివాస్ (39) దివ్యాంగుల పింఛన్ పొందుతున్నారు. అయితే జూన్ 4న శ్రీనివాస్ మృతిచెందినట్లు అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు కావడంతో ఆయనకు పింఛన్ నిలిచిపోయింది. తాను బతికే ఉన్నప్పటికీ మృతుడిగా ఎలా నమోదు చేశారంటూ శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనను మృతుడిగా నమోదు చేసిన అధికారులపై చర్యలు తీసుకుని పింఛన్‌ను పునరుద్ధరించాలని శ్రీనివాస్ కోరుతున్నారు. ఈ ఘటనపై అధికారులు వివరాలు వెల్లడించాల్సి ఉంది.