
వరంగల్ జిల్లాలోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గీసుకొండ మండలంలోని ప్రతిష్టాత్మక వస్త్ర పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదంలో ఇద్దరు వలస కార్మికులు మృతి చెందారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. గణేశా ఏకోపెట్ కంపెనీలో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ సంభవించింది. అక్కడ బాయిలర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దుర్ఘటనలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు సాంకేతిక నిపుణులు అభిలాశ్ (30), సూర్యప్రకాశ్ (31) ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన సమయంలో వీరు ఇద్దరూ లిఫ్టులో ఇరుక్కుపోయి ఉండొచ్చని, ఊపిరాడక లేదా తీవ్ర గాయాలతో మృతి చెంది ఉంటారని అధికారులు భావిస్తున్నారు.
సమాచారం అందుకున్న వెంటనే గీసుకొండ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించి, ప్రమాదానికి అసలు కారణాలపై విచారణ ప్రారంభించారు. పరిశ్రమల్లో సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఇలాంటి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని కార్మిక సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.