Reading Time: 2 minutes

ఖర్గే ర్యాలీ తర్వాత శుద్ధీకరణ.. రాజ్యసభలో రచ్చ రచ్చ

Caption of Image.

కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు జరిగిన ఘోర  అవమానంపై రాజ్యసభలో తీవ్ర దుమారం రేగింది. ఖర్గే ఇటీవల నిర్వహించిన ర్యాలీ తర్వాత.. శుద్ధీకరణ చేసిన అంశం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఈ అంశంపై విపక్షాలు అధికార బీజేపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. 

2026 ఆగస్టు 13న రాజ్యసభలో తనకు జరిగిన అవమానాన్ని ప్రస్తావించారు ఖర్గే. దీనికి బీజేపీ సమాధానం చెప్పాల్సిందిగా విపక్ష సభ్యులు ఆందోళన చేశారు. స్పందించిన కేంద్ర మంత్రి జేపీ నడ్డా.. ఇది దురదృష్టకరం అని.. బీజేపీ ఇలాంటి కార్యకలాపలకు పాల్పడదని వివరణ ఇచ్చారు. బీజేపీ కనుసన్నలలోనే ఈ అనాగరిక చర్య జరిగిందని విపక్షాలు పట్టబట్టాయి. 

ఈ వివాదం ఇప్పటికే ఉత్తరాఖండ్ లో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. రామ్ లీలా గ్రౌండ్ లో జరిగిన శుద్ధీకరణపై ఇరు పార్టీలు విమర్శలు చేసుకున్నాయి. 

ఏం జరిగింది..?

బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరాఖండ్ లో కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ జరిగిన రెండు రోజుల తర్వాత రైట్ వింగ్ అనుబంధ సంస్థ శుద్ధీకరణ చేశారు. 

ఆగస్టు 8న జరిగిన ర్యాలీ ప్రదేశంలో.. స్టేజీ వేసిన చోట..  బీజేపీ కార్యకర్తలు శుద్ధీకరణ (ప్యూరిఫికేషన్) కు పాల్పడినట్లు ఖర్గే హౌస్ దృష్టికి తీసుకొచ్చారు. ర్యాలీ సందర్భంగా లక్షల మంది ప్రజలు ఉన్నారు. ఏ ఒక్క కమ్యూనిటీ లేదా మతం గురించి నేను మాట్లాడలేదు. అక్కడి ప్రజల సమస్యలపై మాత్రమే మాట్లాడాను..కానీ నా స్పీచ్ తర్వాత బీజేపీ కార్యకర్తలు హవన్.. శుద్ధీకరణ చేశారని ఆయన ఆరోపించారు. 

తను దళితుడనే కారణంగానే ఇలాంటి శుద్ధీకరణకు పాల్పడ్డారని ఖర్గే ఆరోపించారు. ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడేవారు ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపడతారు..? రాజ్యాంగాన్ని ఎలా రక్షిస్తారు.. ప్రతిపక్ష నేతకు ఇంత అవమానం జరిగితే సామాన్యుడి పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. 

ఈ సందర్భంగా.. అంటరాని తనానికి మించి మహా పాపం ఈ ప్రపంచంలో ఎక్కడా లేదని రాజ్యసభ స్పీకర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. దీన్ని అందరూ ఖండించాల్సిందేనని.. దీనిపై మరోమాట లేదని అన్నారు. 

దీనిపై స్పందించిన మంత్రి నడ్డా.. బీజేపీ కార్యకర్తలు, బీజేపీనే చేసిందని పదే పదే అనవద్దని అన్నారు. బీజేపీ ఇలాంటి అనాగరిక ఆచారాలను చేయదని అన్నారు. 

©️ VIL Media Pvt Ltd.