
లోకం తీరు రోజురోజుకూ మారిపోతోంది. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాల నుంచి ప్రస్తుతం చిన్న కుటుంబాలకు మారిన ప్రజలు మరో అడుగు ముందుకు వేశారు. బయటకు మాత్రం కపుల్స్ అంటూ తిరిగే మెుగుడూ పెళ్లాలు ఇంట్రో మాత్రం ఎవరి కప్పులు వాళ్లవే, ఎవరి అంట్లు వాళ్లవే అంటూ వేరువేరుగా వండుకునితే కొత్త ట్రెండ్ ప్రపంచాన్ని చుట్టేస్తోంది. ప్రస్తుతం క్రేజీగా మారిన ఫుడ్ డైవర్స్ ట్రెండ్ గురించి ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి…
‘ఫుడ్ డైవర్స్’ పేరు వినగానే విడాకుల గురించి అనిపించినా.. ఇది పెళ్లి బంధాన్ని తెంచుకోవడం కాదు. ఒకే ఇంట్లో ఉంటూ, షాపింగ్ చేయడం, వంట చేసుకోవడం, భోజనం చేయడం మాత్రం విడివిడిగా చేసుకునే కొత్త ట్రెండ్. బ్రిటన్‌లో కొందరు కపుల్స్ ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. వర్కింగ్ టైమింగ్స్, మారిన ఆహారపు అలవాట్లు, ఫుడ్ అలర్జీలు, ప్రీ-ప్యాకేజ్డ్ ఫుడ్ పెరగడం, అలాగే Mounjaro, Ozempic వంటి GLP-1 మందుల ప్రభావం కారణంగా కపుల్స్ భోజన సమయాలు మారుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. సంప్రదాయంగా కలిసి భోజనం చేయడం అనుబంధానికి సంకేతంగా భావించినా.. ఇప్పుడు కొందరు జంటలకు ‘విడివిడిగా తినడమే హ్యాపీ రిలేషన్‌షిప్‌కు సీక్రెట్’గా మారిపోయింది.
GLP-1 మందులు ఆకలి, తినాలనే ఆసక్తి, ఆహారం పట్ల వ్యక్తుల అనుభూతిని మార్చగలవని సిటీ సెయింట్ జార్జ్స్ యూనివర్సిటీ ఆఫ్ లండన్‌కు చెందిన డాక్టర్ లీలా ఫాతి అన్నారు. కొందరిలో వికారం, తినడంపై ఆసక్తి తగ్గడం వంటి సమస్యలు రావడంతో భాగస్వామితో కలిసి భోజనం చేయడం కూడా ఇబ్బందిగా మారొచ్చు. మరోవైపు ఫుడ్ అలర్జీలు, మారుతున్న డైట్ ప్యాటర్న్లు, ‘హై ప్రోటీన్’ పేరుతో మార్కెట్లోకి వస్తున్న అల్ట్రా-ప్రాసెస్డ్, ముందే తయారైన ఆహారాలు కూడా వంట చేసుకుని తినే సందర్భాలను తగ్గిస్తున్నాయని ఆమె చెబుతున్నారు. అంటే భోజనం ఇప్పుడు కేవలం కలిసి కూర్చునే సమయం కాకుండా.. ప్రతి వ్యక్తి తన అవసరాలకు తగ్గట్టు ఎంచుకునే వ్యక్తిగత వ్యవహారంగా మారుతోంది.
ALSO READ : కర్ణాటక సర్కార్ సంచలన నిర్ణయం: గుట్కా, పాన్ మసాలాలపై బ్యాన్..
డోర్సెట్‌కు చెందిన 29 ఏళ్ల ఎల్లీ స్టర్డీ జీవితంలో Mounjaro తర్వాత ఈ మార్పు స్పష్టంగా కనిపించింది. భర్త మైక్‌తో కలిసి టేక్‌అవేలు, రెస్టారెంట్ ఫుడ్, ఇంట్లో పాస్తా తినే ఆమెకు 2024 సెప్టెంబర్‌లో Mounjaro ప్రారంభించిన తర్వాత తినాలన్న ఆసక్తి తగ్గిపోయింది. భర్త వండిన భోజనం కొన్ని ముద్దలు తిన్నాక కూడా వద్దనిపించేది. చివరకు ఇద్దరూ భోజనం విషయంలో గొడవపడకుండా విడివిడిగా తినడం ప్రారంభించారు. ప్రస్తుతం ఎల్లీ ఆ మందు వాడకపోయినా ఆ విధానాన్ని కొనసాగిస్తున్నారు. ఆమె మాటల్లో చెప్పాలంటే.. “మేము గొడవపడము, రాజీ పడాల్సిన అవసరం లేదు. కలిసి బయట తినే సందర్భాలు మాత్రం మరింత ప్రత్యేకంగా అనిపిస్తాయి” అని చెప్పారు.
లండన్‌కు చెందిన 42 ఏళ్ల ఎమీ కార్టర్, భర్త మ్యాట్‌ది మరో ఆసక్తికరమైన స్టోరీ. మ్యాట్ షిఫ్ట్‌లలో పనిచేయడం, ఏమీకి బిజీ సోషల్ లైఫ్ ఉండటంతో మొదట భోజన సమయాలు వేరయ్యాయి. ఆ తర్వాత వ్యక్తిగతంగా ఫుడ్ షాపింగ్ చేసుకోవడం కూడా అలవాటైంది. ఇప్పుడు ఏమీ తనకు నచ్చిన గస్టో బాక్సులు ఆర్డర్ చేసుకుని ఎమీ లంచ్, డిన్నర్ ప్లాన్ చేసుకుంటుంది. ఫ్రిజ్‌లో కూడా కొన్ని వస్తువులు విడివిడిగా ఉంటాయి. బయటివారికి వీరి జీవితం ‘హౌస్‌మేట్స్‌లా’ కనిపించినా.. 10 ఏళ్ల వివాహ జీవితం తర్వాత కూడా ఈ విధానం తమ బంధానికి బాగా పనిచేస్తోందని ఎమీ చెబుతోంది. “మేము ఒకరికి ఒకరం సమయం ఇస్తాం. మాకు విడిగా తినడమూ అందులో భాగమే” అంటోంది.
అయితే నిపుణుల అభిప్రాయం మాత్రం కొంత భిన్నంగా ఉంది. రిలేషన్‌షిప్ కౌన్సెలర్లు కలిసి భోజనం చేయడం ద్వారా మాట్లాడుకోవడం, అనుబంధం పెరగడం, రోజువారీ జీవితాన్ని పంచుకోవడం సులభమవుతుందని చాలాకాలంగా చెబుతున్నారు. కౌన్సెలర్ క్రిస్టినా ఫ్రేజర్ “సపరేట్ ప్లేట్స్, సపరేట్ లైఫ్స్” అంటూ భోజనాలు పూర్తిగా వేరైపోవడం కొన్నిసార్లు భావోద్వేగ దూరానికి సంకేతం కావచ్చని హెచ్చరిస్తున్నారు. అయితే ప్రతి జంట పరిస్థితి ఒకేలా ఉండదు. కొందరికి కలిసి తినడం ప్రేమకు గుర్తైతే, మరికొందరికి ఒత్తిడి లేకుండా తమకు నచ్చిన సమయంలో, నచ్చిన ఆహారం తినడమే సంతోషం. చివరికి ‘ఫుడ్ డైవర్స్’ బంధాన్ని పాడుచేస్తుందా లేక కొత్త రకమైన స్వేచ్ఛను ఇస్తుందా అన్నది కపుల్స్ మధ్య ఉన్న అనుబంధం, సంభాషణ, పరస్పర అవగాహనపైనే ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.