Reading Time: 2 minutes

Samantha: ‘అసాధ్యమనుకున్నవన్నీ నా జీవితమయ్యాయి’.. మిస్టరీ ప్లాన్ పై సమంత షాకింగ్ పోస్ట్!

Caption of Image.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మరోసారి తన సోషల్ మీడియా పోస్ట్‌తో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు.  తన కలలు, వాటిని సాధించేందుకు చేసిన ప్రయాణం గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా “అసాధ్యంగా అనిపించిన ఎన్నో విషయాలు ఇప్పుడు నా జీవితంగా మారాయి” అంటూ సమంత చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.  ఆమె పెట్టిన ఈ లేటెస్ట్ పోస్ట్ ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. 

అసాధ్యమనుకున్నవన్నీ..

తనకు తానే ఇచ్చుకున్న 1000 రోజుల ప్రతిజ్ఞలో ఇది 484వ రోజు అంటూ సమంత తన పోస్ట్‌ను ప్రారంభించారు. ఇంకా జరగని జీవితాన్ని ముందుగానే రాసుకోవడంలో ఎంతో శక్తి ఉందని ఆమె చెప్పుకొచ్చారు. తన కోరికల జాబితాలో కొన్ని విషయాలు చాలా పెద్దవిగా ఉండేవని, వాటిని రాస్తున్నప్పుడు తనకే కాస్త అసంబద్ధంగా అనిపించేదని తెలిపారు. అయినప్పటికీ వాటిని రాసి పెట్టుకున్నానని, ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఒకప్పుడు అసాధ్యమనుకున్న వాటిలో ఎన్నో నిజ జీవితంగా మారాయని వెల్లడించారు.

ఓ గడువు పెట్టుకోవాలి…

అక్కడితో ఆగకుండా కలలకు కూడా ఓ గడువు పెట్టుకోవాలని ఫ్యాన్స్ కు సమంత సూచించారు. చుట్టూ వినిపించే అనవసరమైన మాటలను పక్కనపెట్టి, లక్ష్యంపై పూర్తిగా దృష్టి పెట్టాలని, ఉత్సాహం తగ్గిపోయినా కష్టపడటం మాత్రం ఆపకూడదని పేర్కొన్నారు. తాను రాసుకున్న పేజీలను మళ్లీ చదివినప్పుడు తన పాత రూపాన్ని కలుసుకున్నట్టుగా ఉంటుందని సమంత చెప్పారు. ఏదో ఒకటి సాధించాలని బలంగా కోరుకున్నప్పటికీ, దాన్ని నిజంగా సాధించగలననే నమ్మకం పూర్తిగా లేని ఆ అమ్మాయిని ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నానన్నారు. చివరకు ‘ఆమె సాధించింది’ అనే భావన ఎంతో ప్రత్యేకంగా ఉంటుందని పేర్కొన్నారు.

పెద్దగా కలలు కనండి..

ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూసి కలలను చిన్నవిగా చేసుకోవద్దని, ఇతరులకు అవి పిచ్చిగా లేదా అసాధ్యంగా అనిపించినా వాటిని నమ్మాలని సమంత పిలుపునిచ్చారు. ‘పెద్దగా కలలు కనండి.. నమ్మండి.. నమ్ముతూనే ఉండండి’ అంటూ ఆమె ఇచ్చిన సందేశం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ పోస్ట్ వెనుక సమంత ఏం సాధించాలనుకున్నారు? ఆమె రాసుకున్న ఆ ‘అసాధ్య’ లక్ష్యాలు ఏంటి? అనే ఆసక్తి కూడా అభిమానుల్లో మొదలైంది. నెట్టింట ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

 

©️ VIL Media Pvt Ltd.