Reading Time: 2 minutes
Soya Chunks Dry Recipe Easy Protein Rich Soya Fry

Soya Chunks Recipe: శ్రావణ మాసంలో నాన్‌వెజ్‌కి దూరంగా ఉండే మాంసాహార ప్రియుల కోసం సోయా చంక్స్ డ్రై (Soya Chunks Dry) అద్భుతమైన ప్రత్యామ్నాయం. చికెన్, మటన్ ముక్కల్లాగే నమలడానికి వీలుగా ఉండే ఈ రెసిపీ రుచిలోనే కాదు.. ప్రొటీన్లు అందించడంలోనూ సాటిలేనిది. ఇంట్లోనే అత్యంత సులభంగా, తక్కువ సమయంలో దీనిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం!

కావాల్సిన పదార్థాలు:

మిల్ మేకర్ (సోయా చంక్స్): ¾ నుంచి 1 కప్పు (చిన్నవి)
ఉల్లిపాయ: 1 (పెద్దది – నిలువుగా తరిగినవి)
టమాటాలు: 2 (సన్నగా తరిగినవి)
అల్లం వెల్లుల్లి పేస్ట్: ¾ నుంచి 1 టీస్పూన్
పచ్చిమిర్చి: 1 నుంచి 2 (పొడవుగా కోసినవి)
జీలకర్ర: ½ టీస్పూన్
కరివేపాకు: ఒక గమ్మ
ఇంగువ: చిటికెడు
కారం: ½ టీస్పూన్
గరం మసాలా (లేదా కిచెన్ కింగ్ మసాలా): ½ నుంచి ¾ టీస్పూన్
పసుపు: చిటికెడు
నూనె: 2 టేబుల్ స్పూన్లు
కొత్తిమీర: కొద్దిగా (గార్నిష్ కోసం)
ఉప్పు: రుచికి సరిపడా

తయారీ విధానం:

ముందుగా ఒక పాత్రలో 3 కప్పుల నీటిని మరిగించి, అందులో సోయా చంక్స్ వేసి 5 నిమిషాల పాటు ఉడికించాలి. అనంతరం స్టవ్ ఆఫ్‌ చేసి కాసేపు నీటిలోనే ఉంచాలి. తర్వాత చల్లటి నీటితో రెండుసార్లు శుభ్రంగా కడిగి, నీరు ఏమీ లేకుండా గట్టిగా పిండి పక్కన పెట్టుకోవాలి. పిండిన సోయా చంక్స్‌లో ½ టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ¼ టీస్పూన్ కారం, ½ టీస్పూన్ గరం మసాలా వేసి బాగా కలిపి 15 నిమిషాల పాటు పక్కన ఉంచితే ముక్కలకు మసాలా బాగా పడుతుంది. పాన్‌లో నూనె వేడి చేసి జీలకర్ర, కరివేపాకు వేయాలి. జీలకర్ర చిటపటలాడాక ఇంగువ, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయలు దోరగా మారే వరకు వేయించాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం పాటు వేయించాలి. ఇప్పుడు టమాటా ముక్కలు, పసుపు, కొద్దిగా ఉప్పు వేసి టమాటాలు మెత్తగా అయ్యే వరకు మగ్గనివ్వాలి. టమాట గుజ్జుగా మారిన తర్వాత కారం, గరం మసాలా, సిద్ధం చేసుకున్న సోయా చంక్స్ వేసి బాగా కలపాలి. మూత పెట్టి సన్నని మంటపై 3 నుంచి 5 నిమిషాలు ఉడికించాలి. (మిశ్రమం మరీ పొడిగా అనిపిస్తే లైట్‌గా నీళ్లు చల్లవచ్చు). మసాలాలన్నీ ముక్కలకు పట్టి మంచి సువాసన వచ్చే వరకు మరో 2-3 నిమిషాలు వేయించాలి. చివరగా ఉప్పు, మసాలా సరిపోయాయో లేదో చూసుకుని, పైన సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్‌ చేస్తే ఘుమఘుమలాడే సోయా చంక్స్ ఫ్రై రెడీ! ఈ శ్రావణ మాసంలో వేడివేడి అన్నంలోకి గానీ, రోటీల్లోకి గానీ ఈ కారకారంగా ఉండే సోయా డ్రై ఫ్రై ట్రై చేసి చూడండి!