
రెండు దశాబ్దాలు.. అంటే ఇరవై ఏళ్లకు పైగా దేశంలో నిరంకుశ పాలన సాగించిన సిరియా మాజీ అధ్యక్షుడు బసర్ అల్ అసద్ కు మరణ శిక్ష విధించింది ఆ దేశ న్యాయస్థానం. యుద్ధ నేరాలు, మానవత్వానికి వ్యతిరేకంగా క్రూరమైన నేరప్రవృత్తితో ప్రజలను హింసించి దేశంలో సివిల్ వార్ కు కారణమయ్యారని ఆయనకు మరణ శిక్ష విధించింది డమాస్కస్ క్రిమినల్ కోర్టు.
సిరియాలో అసద్ ప్రభుత్వం కూలిపోయి, అహ్మద్ అల్-షరా నాయకత్వంలో డిసెంబర్ 2024లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి నుంచి అసద్‌కు విధించిన మొదటి మరణశిక్ష ఇదే. దేశంలో ఘోరమైన హింసాకాండను వ్యతిరేకిస్తూ ఇస్లామిస్ట్ నేతృత్వంలోని దళాలు డమాస్కస్‌ను చుట్టుముట్టడంతో.. అసద్ తన 24 ఏళ్ల పాలనకు ముగింపు పలుకుతూ.. కుటుంబంతో మాస్కోకు పారిపోయారు.
అసద్ సోదరుడు , దక్షిణ దేరా ప్రావిన్స్‌లోని పొలిటికల్ సెక్యూరిటీ డైరెక్టరేట్ మాజీ అధిపతి అయిన అతేఫ్ నజీబ్‌కు కూడా కోర్టు మరణశిక్ష విధించింది. నజీబ్‌పై వ్యక్తిగతంగా విచారణ జరిపి, ప్లాన్డ్ మర్డర్ , హింస నేరాలకు పాల్పడినట్లు నిర్ధారించారు.
లక్షల మందిని పొట్టన పెట్టుకున్న నిరంకుశత్వం:
అసద్ 2000లో తన తండ్రి హఫీజ్ అల్-అసద్ తర్వాత అధికారంలోకి వచ్చి, డిసెంబర్ 2024లో సదవి కోల్పోయాడు. ఆయన తండ్రి దాదాపు మూడు దశాబ్దాల పాటు దేశాన్ని పాలించారు.
దేరాలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను భద్రతా దళాలు హింసాత్మకంగా అణచివేసిన తర్వాత 2011లో సిరియా అంతర్యుద్ధం ప్రారంభమైంది. ఈ తిరుగుబాటు ప్రభుత్వ బలగాలు, సాయుధ ప్రతిపక్ష వర్గాలు, విదేశీ శక్తులతో కూడిన దేశవ్యాప్త సంఘర్షణగా తీవ్రరూపం దాల్చింది. దీని ఫలితంగా లక్షలాది మంది మరణించగా, కోట్లాది మంది నిరాశ్రయులయ్యారు.
సివిల్ వార్ సందర్భంగా.. చట్ట విరుద్ధంగా.. క్రూరంగా.. ఎంతో మందిని హత్య చేశారని, చిత్రహింసలకు గురిచేసి, ప్రభుత్వంపై వ్యతిరేకంగా పోరాడే వారిని కనపడకుండా చేశారనే ఆరోపణలున్నాయి. ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ హక్కుల సంస్థలు దేశ రక్షణ వ్యవస్థ, పోలీసు బలగాలన్నింటినీ దుర్వినియోగం చేసి ప్రజలకు నరకం చూపించినట్లు తేల్చాయి.
అదే సమయంలో పౌరులపై కెమికల్ వెపన్స్ వినియోగించి చిత్రహింసలు పెట్టినట్లు దర్యాప్తులో తేలింది. కెమికల్ వెపన్స్ నిర్మూలన సంస్థ (OPCW) , ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో జరిపిన దర్యాప్తులో ప్రభుత్వ బలగాలు రసాయనిక ఆయుధాలు వినియోగించినట్లు తేల్చాయి. అంతేకాకుండా 2013లో డమాస్కస్ సమీపంలోని తూర్పు ఘౌటాలోని ప్రతిపక్షాల ఆధీనంలో ఉన్న ప్రాంతాలపై దాడితో సహా అనేక రసాయన దాడులకు సిరియా ప్రభుత్వ బలగాలే కారణమని తేలింది. 2013లో జరిగిన రసాయన దాడులకు సంబంధించిన అంశంలో.. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడినట్లు రుజువు అవ్వడంతో అసద్‌పై అరెస్టు వారెంట్లు జారీ అయ్యాయి.
అంతే కాకుండా అసద్ పాలనలో ప్రశ్నించిన వారిని నిర్బంధించి టార్చర్ చేసే వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నట్లు తేలింది. తీవ్ర చిత్రహింసలతో ఎందరో నాయకులు, పౌరులు కస్టడీలోనే చనిపోయారని ప్రాసిక్యూషన్ లో తేలింది.