Reading Time: 2 minutes
Video: మరో విధ్వంసానికి రెడీ.. ప్రాక్టీస్‌తోనే పవర్ ఫుల్ మెసేజ్ పంపిన టీమిండియా యమ కింకరుడు..

Vaibhav Suryavanshi: భారత క్రికెట్ రంగాన్ని తన అద్భుత ఆటతీరుతో ఊపేస్తున్న 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు మరో కీలక సమరానికి సిద్ధమయ్యాడు. రాబోయే దిలీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ వైస్ కెప్టెన్‌గా ఎంపికైన ఈ చిన్నోడు, మైదానంలో పరుగుల వర్షం కురిపించేందుకు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో అతడు పంచుకున్న ప్రాక్టీస్ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.

అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటికే తనదైన ముద్ర వేసిన వైభవ్ సూర్యవంశి, రాబోయే 2026-27 దేశవాళీ క్రికెట్ సీజన్ కోసం కఠినమైన శిక్షణ మొదలుపెట్టాడు. దిలీప్ ట్రోఫీ ఆగస్టు 23 నుంచి ప్రారంభం కానుండటంతో, బ్యాటింగ్ లోపాలను సరిదిద్దుకునేందుకు మైదానంలో గంటల తరబడి చెమటోడుస్తున్నాడు. నెట్స్‌లో శ్రమిస్తున్న క్షణాలను చిత్రీకరించిన ఒక ప్రత్యేక వీడియోను తన అధికారిక సామాజిక మాధ్యమ ఖాతాలో అభిమానులతో పంచుకున్నాడు. ఈ వీడియోకు ‘ప్రిపరేషన్’ అనే ఒకే ఒక్క మాటతో సందేశం జోడించాడు. బ్యాటింగ్‌లో డిఫెన్స్ మాత్రమే కాకుండా, మైదానం నలుమూలలా విద్వాంసకర షాట్లు ఆడేందుకు ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. 15 ఏళ్ల పసి వయసులోనే ఒక జట్టుకు నాయకత్వ బాధ్యతలు మోయడం అంటే సామాన్యమైన విషయం కాదు. అయితే, ఈస్ట్ జోన్ వైస్ కెప్టెన్‌గా నెగ్గుకొచ్చేందుకు ఈ కుర్రాడు పక్కా ప్రణాళికతో ముందడుగు వేస్తున్నాడు.

ఎక్కువమంది చదివింది: Pakistan: డబ్బు కోసమే పాకిస్థాన్ ఆటగాళ్ల ఆరాటం.. మాజీ సెలెక్టర్ సంచలన వ్యాఖ్యలు..!

భవిష్యత్తు నాయకుడిగా తీర్చిదిద్దే బాధ్యత..

ఈస్ట్ జోన్ సీనియర్ జట్టుకు వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, వైభవ్ సూర్యవంశికి వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. కేవలం బ్యాటర్‌గానే కాకుండా, భవిష్యత్తులో టీమిండియాను నడిపించగల అగ్రశ్రేణి నాయకుడిగా అతడిని తీర్చిదిద్దడమే తమ ముఖ్య ఉద్దేశమని ఈస్ట్ జోన్ సెలెక్టర్లు ఇదివరకే స్పష్టం చేశారు. చిన్న వయసులోనే ఇటువంటి కీలక బాధ్యత రావడం అతడిలోని అసాధారణ ప్రతిభకు దక్కిన అతిపెద్ద గౌరవం. ఆగస్టు 23 నుంచి నార్త్ ఈస్ట్ జోన్‌తో జరగబోయే తొలి పోరులో ఈస్ట్ జోన్ తరపున వైభవ్ మైదానంలోకి దిగనున్నాడు. నాయకత్వ ఒత్తిడిని పక్కనపెట్టి, తన సహజ సిద్ధమైన దూకుడుతో పరుగుల వరద పారించాలని పట్టుదలతో ఉన్నాడు.

రికార్డుల వీరుడు.. సంచలనాల సిరీస్..

ఇటీవల ముగిసిన ఇంగ్లాండ్ పర్యటనలో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన సూర్యవంశి, భారత్ తరపున బరిలోకి దిగిన అత్యంత పిన్న వయస్కుడిగా సరికొత్త చరిత్ర సృష్టించాడు. కేవలం 15 ఏళ్ల 99 రోజుల వయసులోనే ఈ అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లాండ్ పర్యటనలో తొలి కొన్ని మ్యాచ్‌ల్లో ఆశించిన రీతిలో రాణించలేకపోయినా, ఆ తర్వాత జరిగిన జింబాబ్వే సిరీస్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. మూడు టీ20 మ్యాచ్‌ల్లో ఏకంగా 151 పరుగులు సాధించి, ఆ సిరీస్‌లోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. 50.33 సగటు, 196.10 స్ట్రైక్ రేట్‌తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఇందులో రెండు అద్భుతమైన అర్ధ సెంచరీలు ఉండగా, 81 పరుగులు అతడి అత్యధిక స్కోరుగా నిలిచింది. ఈ అద్భుత ప్రదర్శనకు గాను సిరీస్ వీరుడి అవార్డు సైతం సొంతం చేసుకున్నాడు.

ఎక్కువమంది చదివింది: Video: ట్రావిస్ హెడ్‌కి అసలైన మొగుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా.. సొంతగడ్డపై దిమ్మతిరిగే షాక్..!

వెస్ట్ ఇండీస్ సమరానికి దిలీప్ ట్రోఫీ రిహార్సల్..

ఇప్పటివరకు 6 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన సూర్యవంశీ 32.16 సగటుతో 193 పరుగులు సాధించాడు. వచ్చే నెలలో భారత జట్టు వెస్ట్ ఇండీస్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ ఐదు టీ20ల సిరీస్ ఆడాల్సి ఉంది. అంతర్జాతీయ మ్యాచ్‌ల కంటే ముందే దిలీప్ ట్రోఫీ రూపంలో ఒక బలమైన వేదిక దొరకడం ఈ యువ సంచలనానికి బాగా కలిసొచ్చే అంశం. ఎర్ర బంతితో జరిగే ఈ దేశవాళీ టోర్నీలో రాణించడం ద్వారా అంతర్జాతీయ మ్యాచ్‌లకు తన ఫామ్‌ను కొనసాగించాలని భావిస్తున్నాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో టీమిండియా సాధించిన విజయంలో భాగమైన వైభవ్, ఇప్పుడు రెడ్ బాల్ క్రికెట్‌లోనూ తనేంటో నిరూపించుకోవడానికి సర్వసిద్ధమయ్యాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..