Reading Time: 2 minutes
Bill Gates Daughter: బిల్ గేట్స్ కూతురు ఫోబీ గేట్స్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష? అసలేంటీ కుకీ స్టఫింగ్..?

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Bill Gates) కుమార్తె ఫోబీ గేట్స్‌(Phoebe Gates)కు చెందిన షాపింగ్ స్టార్టప్ ఫియా (Phia) వివాదంలో చిక్కుకుంది. ఫోబీ గేట్స్, స్టాన్‌ఫోర్డ్ గ్రాడ్యుయేట్ సోఫియా కియాన్నితో కలిసి ఈ సంస్థను స్థాపించారు. ఆన్‌లైన్ షాపింగ్ సమయంలో డిస్కౌంట్ కూపన్లను అందించే బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్‌గా ఫియా పనిచేస్తుంది. అయితే, సంస్థపై ‘కుకీ స్టఫింగ్’ అనే మోసపూరిత పద్ధతిని ఉపయోగించిందనే ఆరోపణలు తాజాగా తెరపైకి వచ్చాయి.

అసలు ‘కుకీ స్టఫింగ్’ అంటే ఏమిటి?

ఫియా బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్ ద్వారా వినియోగదారులు ఆన్‌లైన్ షాపింగ్ చేసేటప్పుడు డిస్కౌంట్ కూపన్లను పొందుతారు. వినియోగదారు ఫియా అందించిన కూపన్‌ను ఉపయోగించి కొనుగోలు చేసినప్పుడు, ఆ కొనుగోలుకు ఫియా కారణమైందని రిటైలర్‌కు తెలియజేసేలా ఓ చిన్న ట్రాకింగ్ ఫైల్‌ను, అంటే ‘కుకీ’ని సాఫ్ట్‌వేర్ ఉంచుతుంది. దీని ఆధారంగా సంస్థకు కమీషన్ లభిస్తుంది. అయితే, వినియోగదారు ఫియా సహాయం లేకుండానే కొనుగోలు చేసినప్పటికీ.. ఫియా ఆ కొనుగోలుకు కారణమైనట్లు చూపిస్తూ ట్రాకింగ్ కుకీని ఉంచితే దానిని కుకీ స్టఫింగ్ అంటారు.

ఆరోపణలు రుజువైతే ఫోబీ గేట్స్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష

అమెరికాలో ఇలాంటి చర్యలు ఫెడరల్ వైర్ ఫ్రాడ్ కింద పరిగణించే అవకాశం ఉందని గివ్నర్ లా వ్యవస్థాపకురాలు, న్యాయవాది ఏరియల్ గివ్నర్ పేర్కొన్నారు. ఆరోపణలు నిరూపితమైతే గరిష్ఠంగా 20 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానాలు, నష్టపరిహారం వంటి పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని ఆమె తెలిపారు.

డిసెంబర్ నుంచే సమస్య ఉన్నట్లు నివేదిక

ఫియాలో ఈ సమస్య తమకు జూలైలోనే తెలిసిందని, అది ఒక సాంకేతిక లోపం వల్ల జరిగిందని సంస్థ గతంలో పేర్కొంది. అయితే, బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం.. ఈ విషయం సంస్థ వ్యవస్థాపకులకు కనీసం ఏడు నెలల ముందే తెలిసి ఉండొచ్చని ఆరోపణలు వచ్చాయి. అంతర్గత స్లాక్ సందేశాలు, సంస్థతో సంబంధం ఉన్న వ్యక్తులను ఉటంకిస్తూ బ్లూమ్‌బర్గ్ కథనం వెల్లడించిన వివరాల ప్రకారం.. వినియోగదారులు ఫియా కూపన్‌ను ఉపయోగించకపోయినా, చెక్‌అవుట్ సమయంలో ఫియా తరఫున కుకీలు డ్రాప్ అవుతున్నాయి. ఈ వ్యవహారం కనీసం డిసెంబర్ నుంచే కొనసాగినట్లు తెలుస్తోంది. నైక్, గ్యాప్, నార్డ్‌స్ట్రోమ్ వంటి రిటైలర్లకు సంబంధించిన కొనుగోళ్లలో కూడా ఇది జరిగినట్లు నివేదిక పేర్కొంది.

ఫియా ఆదాయంపై భారీ ప్రభావం

కుకీ స్టఫింగ్ ద్వారా వచ్చిన ఆదాయం ఫియా మొత్తం ఆదాయంలో గణనీయమైన భాగంగా ఉన్నట్లు బ్లూమ్‌బర్గ్ నివేదించింది. జూలైలో ఈ ఫీచర్లను నిలిపివేసిన తర్వాత సంస్థ సగటు రోజువారీ ఆదాయం సుమారు 80 వేల డాలర్ల నుంచి 10 వేల నుంచి 28 వేల డాలర్లకు పడిపోయినట్లు పేర్కొంది. జూన్‌లో ఫియా తనకు క్రెడిట్ వచ్చిన మొత్తం మర్చండైజ్ విలువలో సుమారు 51 శాతం కుకీ స్టఫింగ్‌కు సంబంధించినదిగా ఉన్నట్లు నివేదిక తెలిపింది. అంతర్గత డ్యాష్‌బోర్డ్‌లో ఈ వ్యవహారాన్ని ‘బగ్’గా పేర్కొన్నప్పటికీ, దానికి సంబంధించిన టాగుల్ పేరు “enable coupon auto drop”గా ఉన్నట్లు బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది. మరోవైపు, ఫియా ఆదాయం గురించి ఫోబీ గేట్స్ ఆందోళన వ్యక్తం చేసినట్లు నివేదిక పేర్కొంది. ముఖ్యంగా Etsy నుంచి తగినంత కమీషన్ రావడం లేదనే ఆందోళన ఆమె వ్యక్తం చేసినట్లు తెలిపింది.

ఫియా వివరణ ఇదీ..

తమ వల్ల జరిగినట్లు తప్పుగా గుర్తించబడిన లావాదేవీలకు కారణమైన ఫీచర్లను జూలై 7న తొలగించామని ఫియా ప్రతినిధి తెలిపారు. ప్రతి లావాదేవీని సమీక్షిస్తున్నామని, తప్పుగా కేటాయించబడిన కమీషన్లను బ్రాండ్ భాగస్వాములకు తిరిగి చెల్లించే ప్రక్రియను ప్రారంభించామని చెప్పారు. ఇలాంటి సమస్యలు మళ్లీ తలెత్తకుండా సంస్థలో ప్రత్యేకంగా కాంప్లయన్స్ హెడ్‌ను నియమించనున్నట్లు కూడా ఫియా వెల్లడించింది. అదే సమయంలో జూలైలో ఆదాయం పడిపోవడానికి కుకీ స్టఫింగ్ ఒక్కటే కారణం కాదని సంస్థ తెలిపింది. చాలా వరకు మోనిటైజేషన్ విధానాలను నిలిపివేయడం కూడా ఆదాయం తగ్గడానికి కారణమైందని పేర్కొంది. బ్లూమ్‌బర్గ్ తన డేటా విశ్లేషణను అతిగా చూపించిందని ఫియా ఆరోపించింది.

మరోవైపు, అఫిలియేట్ నెట్‌వర్క్ Impact.com ఫియాను సస్పెండ్ చేసి, దానికి సంబంధించిన కమీషన్లను తిరిగి కేటాయించినట్లు నివేదిక తెలిపింది. ఫియా 2025లో సుమారు 30 మిలియన్ డాలర్ల పెట్టుబడులను సమీకరించింది. హేలీ బీబర్, క్రిస్ జెన్నర్, సారా బ్లేక్లీ వంటి ప్రముఖులు కూడా సంస్థకు మద్దతుదారులుగా ఉన్నారు. కాగా, ఫోబీ గేట్స్ తండ్రి బిల్ గేట్స్ ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యక్తుల్లో ఒకరు. ఫోర్బ్స్ అంచనా ప్రకారం ఆయన సంపద సుమారు 108.4 బిలియన్ డాలర్లు.