Reading Time: < 1 minute

సుప్రియా సూలే కూతురు పెళ్లిలో రేర్ సీన్.. ఒకే ఫ్రేమ్‎లో మోడీ, రాహుల్, ఖర్గే, ప్రియాంక నవ్వుతూ ముచ్చట్లు

Caption of Image.

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ మనవరాలు, ఎంపీ సుప్రియా సూలే కుమార్తె రేవతి, సారంగ్‎ల వెడ్డింగ్ రిసెప్షన్ ఢిల్లీలో సోమవారం (ఆగస్ట్ 10) రాత్రి వైభవంగా జరిగింది. దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులంతా హాజరైన ఈ వేడుకలో ఓ అరుదైన దృశ్యం కనిపించింది. నిత్యం ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకునే ప్రధాని మోడీ, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, లోక్ సభ అపొజిషన్ లీడర్ రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీ ఒక ఫ్రేమ్‎లో కనిపించారు. ఉప్పు నిప్పులా ఉండే వీరూ రాజకీయ విభేదాలను పక్కనపెట్టి ఒకేచోట చేరి సరదాగా మాట్లాడుకున్నారు. 

మొదట ప్రధాని మోడీ ప్రియాంక గాంధీని ఎలా ఉన్నారని బాగోగులు అడిగారు. వెంటనే స్పందించిన ప్రియాంక.. నేను బాగున్నాను సార్.. మీరు ఎలా ఉన్నారని బదులిచ్చింది. నేను ఎప్పటిలాగే ఉన్నానని మోడీ తనదైన శైలీలో ప్రియాంకకు రిప్లై ఇచ్చారు. ఇంతలో పక్కనే ఉన్న మల్లికార్జున ఖర్గే మధ్యలో కలగజేసుకుని మోడీ సాబ్ మీరు కొంచెం మారిపోయారని చమత్కరించారు. ఖర్గే కామెడీకి మోడీ, పక్కనే ఉన్న రాహుల్ గాంధీ చిరునవ్వు చిందించారు. వేర్వేరు పార్టీలకు చెందిన ఎంపీలు కూడా ఒకచోట కూర్చొని సరదాగా మాట్లాడిన దృశ్యాలు ఈ కార్యక్రమంలో కనిపించాయి. 

ఈ మొత్తం ఎపిసోడ్‎కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‎గా మారాయి. ఇది చూసిన నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ కార్యక్రమంలో రాజకీయాలను పక్కనబెట్టి నేతలు పరస్పరం పలకరించుకోవడం శుభపరిణామని పేర్కొంటున్నారు నెటిజన్లు. రాజకీయాల్లో సిద్ధాంతాలు, విమర్శలు,  విభేదాలు కేవలం విధానాలు, నిర్ణయాలు, ప్రజా సమస్యల చుట్టూ మాత్రమేనని.. వ్యక్తిగతం కాదని నిరూపించారని కొనియాడుతున్నారు. భిన్నమైన పార్టీల్లో ఉన్నప్పటికీ పొలిటిషియన్స్ స్నేహపూర్వకంగా ఉండటం ముఖ్యమని అంటున్నారు నెటిజన్లు. 

©️ VIL Media Pvt Ltd.