
ఏపీ పోలీస్ కీర్తి దేశమంతా మార్మోగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్ర సచివాలయం నుంచి డీజీపీ నుంచి క్షేత్రస్థాయిలోని స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. డీజీపీ సహా రేంజ్ ఐజీలు, డీఐజీలు, డీఎస్పీలు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏపీ పోలీసుల కీర్తి దేశమంతా మార్మోగాలని దానికి అనుగుణంగా సిద్ధం కావాలని అన్నారు. నేరాల దర్యాప్తులో టెక్నాలజీ ఇంటిగ్రేషన్ పెరగాలని సూచించారు. నేర నియంత్రణలో గోల్డెన్ అవర్ అత్యంత కీలకమని అన్నారు. ‘‘డీజీపీ నుంచి ఎస్‌హెచ్‌ఓ వరకూ సమావేశం నిర్వహించటం ఇదే తొలిసారి. శాంతిభద్రతల విషయంలో లోటు పాట్లను సవరించుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ప్రజలు ప్రశాంతంగా ఉండాలన్నా.. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలన్నా.. శాంతిభద్రతలు ముఖ్యం. రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసు విభాగం ఓ ప్రైడ్. ప్రజల విశ్వాసాన్ని చూరగొనేలా అంతా వ్యవహరించాలి. ఇన్విజిబుల్ పోలీసు, విజిబుల్ పోలీసింగ్ విధానం అమలు చేయాలి. గడచిన రెండేళ్లుగా కాగ్నిజబుల్ క్రైమ్స్ 14 శాతం మేర తగ్గాయి. కాలానుగుణంగా నేరాలు కూడా మారుతున్నాయి. డిజిటల్ క్రైమ్, డిజిటల్ అరెస్టులు తదితర నేరాలు కొత్త సవాళ్లుగా మారుతున్నాయి. దీనికి అనుగుణంగా సాంకేతికతను పోలీసులు అందిపుచ్చుకోవాలి.’’ అని సూచించారు.
‘‘2019-24 మధ్య ఉన్న పాలకులు గంజాయి, కల్తీ మద్యాన్ని ప్రధాన సమస్యగా తయారు చేశారు. పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తాం. గౌరవం పెరిగేలా చర్యలు చేపడతాం. రాష్ట్రవ్యాప్తంగా 14,770 సీసీ కెమెరాలతో పాటు ప్రైవేటు వ్యక్తులు ఏర్పాటు చేసుకున్న కెమెరాలను కలిపి లక్ష కెమెరాలను అనుసంధానించాం. నేరాల దర్యాప్తులో ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్, డీఎన్‌ఏ డిటెక్షన్ లాంటి ఆధునిక విధానాలు పెరిగాయి. వేగంగా నేరాలను గుర్తించగలుగుతున్నాం. టెక్నాలజీ, నాలెడ్జి, బెస్ట్ ప్రాక్టీసెస్‌ను పోలీసు అధికారులు సమర్థంగా అమలు చేస్తే శాంతిభద్రతలు నియంత్రణలోకి వస్తాయి. రాజకీయ నేరాలు, డిజిటల్ నేరాలు, సోషల్ మీడియా అసభ్య పోస్టుల లాంటి నేరాలు పెరిగాయి. మహిళలపై నేరాల విషయంలో జీరో టాలరెన్స్ అని పదేపదే చెబుతున్నాను. ఈ విషయంలో కఠినంగా ఉండాల్సిందే. నేరం జరిగిన ప్రాంతాన్ని సంరక్షించటంలో విఫలం కాకూడదు. నేర నియంత్రణకు పోలీసులూ గోల్డెన్ అవర్ విధానాన్ని పాటించాలి. తప్పు చేస్తే నేరస్తులు తప్పించుకోలేరని తెలిసేలా చేయాలి. వివేకా హత్య కేసు ఘటనలో పూర్తి సమాచారం రాలేదు. పోలీసుల వైపు నుంచి జరిగిన కాస్ట్ లీ మిస్టేక్ అది. కొందరు కావాలనే తప్పు దోవ పట్టించారు. ఇల్లంతా రక్తం మరకలతో తడిస్తే ఆ ఆధారాలను చెరిపేసే ప్రయత్నం చేశారు. ఇది పూర్తి నిర్లక్ష్యం. నేరస్తుల పట్ల ఉదాసీనంగా ఉండొద్దు. జీరో డ్రగ్స్, గంజాయి లేకుండా జాతీయ స్థాయిలో ఓ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మహిళల భద్రతతో పాటు గంజాయి, డ్రగ్స్ నియంత్రణ కోసం డ్రగ్స్ వద్దు బ్రో అన్న ప్రచారాన్ని విస్తృతం చేయండి. రహదారి భద్రత కూడా కీలకమైన అంశం. రోడ్డు ప్రమాదాల అరికట్టేలా సైనేజీలు, రోడ్ ఇంజనీరింగ్, హాట్‌స్పాట్‌లను ఆడిట్ చేయాలి. వీటిపై ప్రజల్లో అవగాహన కల్పించండి.’’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
‘‘శాంతిభద్రతల విషయంలో విఫలమైతే తీవ్రమైన పరిణామాలు మనం అంతా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒక్క చిన్న నిర్లక్ష్యం మొత్తం పోలీసు వ్యవస్థపైనే మరక పడుతుంది. సింగయ్య వాహనం కింద పడిపోయి చనిపోతే కూడా ఎదురు ఆరోపణలు చేశారు. జగన్ కారు కింద పడిపోయినట్టుగా వీడియో వచ్చింది. కారు తొక్కేస్తే పొదల్లో పడేశారు. ప్రాణాలు కాపాడబోయిన పోలీసులపైనే నెపం పడింది. ఇబ్రహీంపట్నంలో రాజకీయ పార్టీ ర్యాలీలో రోడ్డుపై మోటారు సైకిల్ విన్యాసాలు ఏమిటి? పోలీసులపై కూడా దాడులు జరిగే పరిస్థితి ఉంది. ఏ పార్టీ అయినా రోడ్డుపై విన్యాసాలు చేసేందుకు అవకాశం లేదు. ప్రజలకు అసౌకర్యం కలిగించకుండా వెళ్లటం అన్ని పార్టీల బాధ్యత. రాజకీయ పార్టీ నేతలు కాబట్టి ఫ్రీగా వదిలేస్తామంటే శాంతిభద్రతల పరిస్థితి వస్తుంది. రాజకీయ పార్టీలకు ఇష్టానుసారం వ్యవహరించే లైసెన్సు ఇవ్వలేదు. ప్రస్తుతం రోడ్లపై వీరంగం సృష్టిస్తున్న వారిలో 94 శాతం మంది ఒక పార్టీ నుంచే ఉంటున్నారు. పరామర్శలకు వెళ్లటం తప్పేం కాదు. రోడ్లపై చేసే ప్రదర్శనల వల్లే ప్రజలకు ఇబ్బందులు. విశాఖపట్నంలో 3 గంటల పాటు రోడ్లను బ్లాక్ చేశారు. అంబులెన్సులో ఆస్పత్రికి వెళ్లే వారు, ఆఫీసుకు వెళ్లే ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ప్రజలకు ఇబ్బందులు కలగకూడదనే సీఎంగా నేను కూడా వాహన కాన్వాయ్ కుదించుకున్నాను. మానసిక పరిస్థితి సరిగాలేని కొందరు వ్యక్తులు చేసే నేరాలపై ప్రజల్లోనూ చర్చ జరగాలి. కొందరు రౌడీలే సామాజిక మాధ్యమాల్లో హీరోలుగా మారుతున్నారు.’’ అని తెలిపారు.
‘‘శాంతిభద్రతల విషయంలో ఏపీ అత్యుత్తమ రాష్ట్రంగా ఉండాలన్నదే లక్ష్యం. సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత దూషణలు, అసభ్య ప్రచారంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. నేర నిర్ధారణ రేటు పెరిగితే నేరాలు తగ్గుతాయి. పోలీసులు దర్యాప్తు చేసి విజయం సాధించిన కేసుల వివరాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం పూర్తి స్థాయిలో అమలు కావాలి. రాజకీయ పార్టీల ముసుగులో కొందరు గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లను ప్రోత్సహిస్తున్నారు. గతంలో మద్యం తాగించేవారు, ఇప్పుడు గంజాయి మత్తులో వీరంగం చేస్తున్నారు. కొన్ని సామాజిక మాధ్యమాల సాయంతో నేరస్తులుగా మారుతున్నారు. టెక్నాలజీ నేరస్తులను పట్టిస్తోంది, అదే సమయంలో నేరాలు పెంచుతోంది. బ్యాలెన్సింగ్, ప్రాపర్ పోలిసింగ్ ఉండాలి. పోలీసులు అంటే ప్రజల్లో గౌరవం, సంఘ విద్రోహ శక్తులకు భయం కలగాలి. రాష్ట్ర అభివృద్ధితో పాటు శాంతిభద్రతలు కూడా కీలకం. అప్పుడే సుపరిపాలన సాధ్యం. డీజీ కార్యాలయం నుంచి పోలీసు స్టేషన్ వరకూ పోలీసులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. ఇక నుంచి ప్రతీ నెలా పోలీసు పెర్ఫార్మెన్సు రిపోర్టును విడుదల చేయాలి. బెస్ట్ ప్రాక్టీసెస్, సక్సెస్ స్టోరీస్ సహా వివిధ అంశాలను ప్రజలకు వివరిద్దాం.’’ అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా 1200 పోలీసు స్టేషన్ల నుంచి స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, సహా శాంతిభద్రతలు, ట్రాఫిక్, జీఆర్పీ సహా వివిధ విభాగాలకు చెందిన 1650 మంది అధికారులు వర్చువల్ గా పాల్గొన్నారు. ఈ సమావేశానికి హోం మంత్రి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, శాంతి భద్రతల అదనపు డీజీ ఎన్. మధుసూధన రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్హా, ఈగల్ టాస్క్ ఫోర్సు ఐజీ రవికృష్ణ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.