
Ola, Uber, Rapido: ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి యాప్స్ ఓపెన్ చేయగానే ‘అడ్వాన్స్ టిప్ ఇవ్వండి.. మీ ప్రయాణం వేగంగా ఖాయమవుతుంది’ అని చూపే నోటిఫికేషన్లు మీకు ఎప్పుడైనా కనిపించాయా? డ్రైవర్ త్వరగా రావాలన్నా, రైడ్ క్యాన్సిల్ అవ్వకుండా ఉండాలన్నా ముందే కాస్త ఎక్కువ డబ్బులు ఇచ్చుకోవాలనే వాతావరణాన్ని సృష్టిస్తున్న ఈ ప్రీ-టిప్పింగ్ పద్ధతికి కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ చెక్ పెట్టింది. ప్రయాణం పూర్తి కాకముందే ప్రయాణికుల నుంచి టిప్స్ అడిగే ఎలాంటి ఫీచర్లను అయినా యాప్స్ నుంచి తక్షణమే తొలగించాలని అన్ని రవాణా అగ్రిగేటర్లను ఆదేశించింది.
ఇలా ముందే టిప్ అడగడం వల్ల ప్రయాణికుల నిర్ణయాలు ప్రభావితం అవుతాయని, అదనంగా డబ్బులు చెల్లిస్తేనే మెరుగైన సేవలు అందుతాయనే తప్పుడు భావన వారిలో కలుగుతుందని మంత్రిత్వ శాఖ సీరియస్‌గా పేర్కొంది. మోటార్ వాహనాల అగ్రిగేటర్ గైడ్‌లైన్స్, 2025లోని క్లాజ్ 14.15 ప్రకారం టిప్ అనేది పూర్తిగా ప్రయాణికుడి స్వచ్ఛంద నిర్ణయం మాత్రమేనని స్పష్టం చేసింది. బుకింగ్ సమయంలో కానీ, ప్రయాణం ప్రారంభం కావడానికి ముందు కానీ లేదా ప్రయాణం జరుగుతున్న సమయంలో కానీ టిప్ అడిగేందుకు వీల్లేదని తెలిపింది. ప్రయాణం విజయవంతంగా పూర్తయిన తర్వాత మాత్రమే ఈ ఆప్షన్‌ను ప్రయాణికులకు చూపించాలని కేంద్రం తేల్చిచెప్పింది.
ఇటీవల కొన్ని రైడ్ యాప్‌లలో “అడ్వాన్స్ టిప్”, “చూజ్ యాన్ యాడ్-ఆన్” పేరుతో ప్రత్యేక మెసేజ్‌లు వస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ముందే టిప్ ఇస్తే డ్రైవర్ త్వరగా రైడ్‌ను అంగీకరిస్తారని ఆశ చూపే ఈ తరహా నోటిఫికేషన్ల లొసుగులను అరికట్టడానికే ప్రభుత్వం మంగళవారం ఈ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. క్యాబ్ బుకింగ్, డ్రైవర్ కేటాయింపు, వేచి ఉండే సమయం లేదా సేవా ప్రమాణాలను ప్రభావితం చేసేలా ప్రయాణికుల నుంచి అదనపు డబ్బులు గుంజే ఎలాంటి ఫీచర్లు, సందేశాలు, ఆప్షన్లు యాప్‌లలో ఉండకూడదని ఆంక్షలు విధించింది. దీంతో పాటు ప్రయాణికులు ఇచ్చే టిప్ మొత్తం నేరుగా డ్రైవర్ ఖాతాకే వెళ్లాలని, అందులో అగ్రిగేటర్ సంస్థలు ఎలాంటి కమిషన్ లేదా కోతలు విధించకూడదని స్పష్టం చేసింది. వినియోగదారులను మోసం చేసేలా, వారిని భ్రమలకు గురిచేసేలా ఉండే టిప్పింగ్ విధానాలు ‘వినియోగదారుల పరిరక్షణ చట్టం, 2019’ నియమాలకు విరుద్ధమని హెచ్చరించింది. అందువల్ల ఆటో, క్యాబ్ అగ్రిగేటర్లందరూ వెంటనే తమ మొబైల్ యాప్‌లను, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను సమీక్షించుకుని, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఫీచర్లను తక్షణమే తొలగించాలని కేంద్ర మంత్రిత్వ శాఖ ఆదేశించింది.