Reading Time: < 1 minute
అరటిపండ్లు త్వరగా పాడవకుండా ఉండాలా? ఈ చిన్న ట్రిక్ పాటిస్తే వారమైనా తాజాగా ఉంటాయి!

అరటిపండ్లు రుచితో పాటు పోషకాల పరంగా కూడా ఎంతో ఉపయోగకరమైన పండ్లు. విటమిన్లు, పొటాషియం, పీచు పదార్థాలు ఉండటంతో వీటిని చాలామంది రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకుంటారు. అయితే, అరటిపండ్లను కొనుగోలు చేసిన రెండు, మూడు రోజుల్లోనే తొక్కపై నల్లటి మచ్చలు రావడం, పండ్లు మెత్తబడటం సాధారణంగా కనిపిస్తుంది. దీంతో తినకముందే కొన్ని పండ్లు పాడైపోయి వృథా అవుతుంటాయి. అయితే కొన్ని సింపుల్ స్టోరేజ్ టిప్స్ పాటించడం ద్వారా అరటిపండ్లు త్వరగా పక్వానికి రాకుండా కొంతకాలం తాజాగా ఉంచుకోవచ్చు. అదేలాగో ఇప్పుడు చూద్దాం..

అరటిపండ్లను తాజాగా ఉంచే సులభమైన చిట్కా

డిజిటల్ క్రియేటర్ శశాంక్ ఆల్షీ తెలిపిన వివరాల ప్రకారం.. అరటిపండ్లను ఎక్కువ రోజులు నిల్వ ఉంచడానికి ఇంట్లోనే లభించే అల్యూమినియం ఫాయిల్ లేదా క్లింగ్ ప్లాస్టిక్ రాప్ సరిపోతుంది. అరటిపండ్ల గుత్తి పైన ఉండే తొడెము భాగాన్ని అల్యూమినియం ఫాయిల్‌తో గానీ లేదా ప్లాస్టిక్ క్లింగ్ రాప్‌తో గానీ గాలి చొరబడకుండా గట్టిగా కవర్ చేయాలి. పండ్లను విడివిడిగా కాకుండా గుత్తిగానే ఉంచి ఈ విధంగా చుట్టడం వల్ల అవి త్వరగా పాడవవు.

ఈ ట్రిక్ వెనుక ఉన్న సైన్స్ ఏమిటి?

అరటిపండ్లు పక్వానికి రావడానికి త్వరగా పండటానికి ఎథిలీన్ అనే సహజ వాయువు కారణమవుతుంది. ఈ ఎథిలీన్ గ్యాస్ ప్రధానంగా అరటిపండు తొడెము భాగం నుంచే విడుదలై పండు మొత్తానికి వ్యాపిస్తుంది. తొడెము భాగాన్ని ఫాయిల్‌తో కవర్ చేయడం వల్ల ఈ గ్యాస్ బయటకు విడుదల కాకుండా నిరోధించబడుతుంది. దీంతో పండ్లు త్వరగా పండిపోకుండా సుదీర్ఘకాలం తాజాగా ఉంటాయి.

పండ్లను నిల్వ చేసేటప్పుడు పాటించాల్సిన ఇతర జాగ్రత్తలు:

తొడెమును కవర్ చేసిన తర్వాత అరటిపండ్లను గది ఉష్ణోగ్రత వద్ద గాలి తగిలే ప్రదేశంలో ఉంచాలి. నేరుగా సూర్యరశ్మి పడే చోట పెట్టకూడదు. అలాగే, యాపిల్స్, టమోటాలు వంటి ఇతర పండ్ల పక్కన అరటిపండ్లను పెట్టకూడదు. ఎందుకంటే ఆ పండ్ల నుంచి కూడా ఎథిలీన్ గ్యాస్ విడుదలవుతుంది. అంతేకాదు.. అరటిపండ్లను ఫ్రిజ్‌లో పెడితే వాటి తొక్క నల్లగా మారి త్వరగా పాడైపోతాయి. మొత్తంగా, అరటిపండ్లను సరిగ్గా నిల్వ చేయడం ద్వారా వృథాను తగ్గించుకోవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..