
- పెండ్లి వేడుకలో నవ్వుల్లో మునిగిన నేతలు
న్యూఢిల్లీ:రాజకీయ ప్రత్యర్థులుగా నిత్యం తలపడే ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే.. విభేదాలు పక్కన పెట్టి కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. ఢిల్లీలో జరిగిన ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే కూతురి రిసెప్షన్‌కు ఈ ఇద్దరు అగ్ర నేతలు హాజరయ్యారు. ఈ వేడుకలో వీళ్ల మధ్య జరిగిన చిన్న సంభాషణ నవ్వులు పూయించింది.
రిసెప్షన్‌కు వచ్చిన మోదీ ముందుగా లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి షేక్‌హ్యాండ్ ఇచ్చారు. ఆపై అక్కడే ఉన్న ప్రియాంక గాంధీ వాద్రాకు నమస్కారం పెడుతూ ‘ప్రియాంకా జీ.. ఎలా ఉన్నారు?’ అని అడిగారు. ‘బాగున్నా.. మీరెలా ఉన్నారు’ అని ఆమె బదులిచ్చారు. దీనికి మోదీ రిప్లయ్ ఇస్తూ ‘నేను ముందెలా ఉన్నానో ఇప్పుడూ అలాగే ఉన్నా’ అంటూ ముందుకు కదిలారు.
ఇంతలోనే అక్కడే ఉన్న మల్లికార్జున ఖర్గే కల్పించుకున్నారు. ‘భాయ్ సాబ్.. మీరు అంతకుముందులా లేరు. కొంచెం మారారు’ అని సెటైర్ వేశారు. దీంతో మోదీ పగలబడి నవ్వుతూ.. ఖర్గే భుజంపై సరదాగా తట్టారు. వెంటనే ఖర్గే కూడా నవ్వుతూ మోదీ చేయి తట్టారు. ఈ సరదా సన్నివేశం చుట్టూ ఉన్న నేతల్లోనూ నవ్వులు పూయించింది.
మొత్తానికి పార్లమెంట్‌లో మాటల తూటాలు పేల్చే నేతలు పెండ్లి వేడుకలో సంబురంగా పలకరించుకున్నారు. కాగా, సుప్రియా సూలే బిడ్డ రేవతి సూలే నాగ్‌పూర్‌కు చెందిన వ్యాపారవేత్త సారంగ్ లఖానీని జూన్‌లో పెండ్లి చేసుకున్నారు.
సోమవారం రాత్రి ఢిల్లీలోని 6–జనపథ్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ నిర్వహించారు. ఈ వేడుకకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, కేంద్ర మంత్రులు అమిత్‌షా, జై శంకర్, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, స్మృతి ఇరానీ, పీటీ ఉషతోపాటు జాతీయ పార్టీల అగ్రనేతలు, మంత్రులు హాజరయ్యారు. నేతలంతా ఒకరినొకరు పలకరించుకుంటూ కలివిడిగా గడిపిన వీడియో బుధవారం సోషల్ మీడియాలో వైరల్ అయింది.