Reading Time: 2 minutes

Sridevi: అతిలోక సుందరి ‘శ్రీదేవి’ బయోగ్రఫీ: ‘ఎంప్రెస్’ కవర్ పేజీ రిలీజ్ చేసిన ప్రియాంక చోప్రా!

Caption of Image.

భారతీయ చలనచిత్ర రంగాన్ని తన అందం, అభినయంతో దశాబ్దాల పాటు శాసించిన నటి, ‘లేడీ సూపర్ స్టార్’ శ్రీదేవి. ఈ అతిలోక సుందరి ఐదు దశాబ్దాల వెండితెర ప్రయాణాన్ని, ఆమె దివ్యమైన లీగసీని చాటిచెప్పేందుకు ‘ఎంప్రెస్: ది డెఫినిటివ్ బయోగ్రఫీ ఆఫ్ శ్రీదేవి’ (Empress: The Definitive Biography of Sridevi) పేరుతో ఒక పుస్తకం రాబోతోంది. శ్రీదేవి జయంతి సందర్భంగా ఈ పుస్తక ఫస్ట్ లుక్ కవర్‌ను గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనాస్ సోషల్ మీడియా వేదికగా ఆవిష్కరించారు.

ప్రియాంక చోప్రా భావోద్వేగ నివాళి

లేటెస్ట్ గా శ్రీదేవిని గుర్తుచేసుకుంటూ భావోద్వేగ నివాళి అర్పించారు.  ‘ఎంప్రెస్: ది డెఫినిటివ్ బయోగ్రఫీ ఆఫ్ శ్రీదేవి’ పుస్తక కవర్ పేజీని షేర్ చేశారు.  ‘ది వన్ అండ్ ఓన్లీ.. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాం. హ్యాపీ హెవెన్లీ బర్త్‌డే శ్రీదేవి గారూ! ఎంప్రెస్ త్వరలోనే వస్తోంది ‘అంటూ ప్రియాంక ఎమోషనల్ పోస్ట్ చేశారు. దీంతో ఈ బయోగ్రఫీపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి.

ఐదు భాషల్లో..

ప్రముఖ రచయిత ధీరజ్ యు. కుమార్ రాసిన ఈ పుస్తకం, శ్రీదేవి నటజీవితంలోని అరుదైన కోణాలను ఆవిష్కరించనుంది. నాలుగేళ్ల చిన్న వయసులోనే ‘కందన్ కరుణై’ అనే తమిళ సినిమాతో బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి, ఆ తర్వాత తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ పరిశ్రమల్లో స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించారు. ‘పదహారేళ్ళ వయసు’, ‘వేటగాడు’, ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’, ‘క్షణ క్షణం’ వంటి చిత్రాలతో టాలీవుడ్‌ను ఏలిన ఆమె.. హిందీలో ‘హిమ్మత్‌వాలా’, ‘మిస్టర్ ఇండియా’,’చాందిని’, ‘నగీనా’, ‘చాల్‌బాజ్’ చిత్రాలతో బాలీవుడ్ చరిత్రలోనే తొలి ‘పాన్-ఇండియా లేడీ సూపర్ స్టార్’గా ఎదిగారు.

నెంబర్ 1గా. .

హీరోల హవా నడుస్తున్న రోజుల్లోనే.. కేవలం తన పేరుతోనే థియేటర్లకు జనాన్ని రప్పించిన సత్తా శ్రీదేవి సొంతం. కామెడి, ట్రాజెడీ, రొమాన్స్, డాన్స్.. జోనర్ ఏదైనా సరే తన నటనతో అదరగొట్టేసేవారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైనా, మళ్లీ ‘ఇంగ్లీష్ వింగ్లీష్’, ‘మామ్’ సినిమాలతో గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇచ్చి నేటి తరానికి కూడా నటనలో పాఠాలు నేర్పించారు.

పద్మశ్రీ, జాతీయ ఉత్తమ నటి వంటి ఎన్నో పురస్కారాలు అందుకున్న ఈ దైవిక నటి అంతరంగం, తెరవెనుక ఆమె పడిన తపనను ఈ ‘ఎంప్రెస్’ పుస్తకం ప్రేక్షకులకు అందించబోతోంది. త్వరలోనే మార్కెట్‌లోకి రానున్న ఈ బయోగ్రఫీ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది శ్రీదేవి అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..
 

 

©️ VIL Media Pvt Ltd.