
Tulsi Plant Care Tips: వర్షాకాలం.. మొక్కల ఎదుగుదలకు అనుకూలమైన సీజన్. వాతావరణంలో తేమ, చల్లదనం ఉండటంతో చాలా మొక్కల్లో కొత్త ఆకులు, కొమ్మలు వేగంగా పెరుగుతాయి. ఇలాంటివాటిలో తులసి మొక్క కూడా ఒకటి. ఈ కాలంలో మొక్క త్వరగా పెరుగుతుంది. అయితే వర్షం పడుతుందనే కారణంతో తులసి మొక్కను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం మాత్రం మంచిది కాదు. అధిక నీరు, ఎక్కువ తేమ, తగినంత సూర్యకాంతి లేకపోవడం వల్ల తులసి వేర్లు కుళ్లిపోయి ఆకులు పసుపు రంగులోకి మారే అవకాశం కూడా ఉంటుంది.
ఇంట్లోని తులసి మొక్క కేవలం పచ్చగా ఉండటమే కాకుండా.. నాలుగు వైపులా ఎక్కువ కొమ్మలు, ఆకులతో దట్టంగా పెరుగుతే ఎంతో బాగుంటుంది. అయితే ఇలా పెరగాలంటే వర్షాకాలంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. సింపుల్ చిట్కాలను పాటిస్తే తులసి మొక్క ఆరోగ్యంగా, పచ్చగా పెరిగేలా చేయవచ్చు. మరి ఆ టిప్స్ ఏంటో చూసేద్దామా..
దట్టంగా పెంచాలంటే..
తులసి మొక్కను దట్టంగా పెంచేందుకు ఎప్పటికప్పుడు పైన పెరుగుతున్న కొమ్మల చివర్లను తుంచడం లేదా చిన్నగా కత్తిరించడం చేయడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంటే మొక్క పైభాగంలో కొత్తగా పెరుగుతున్న టిప్‌ను వేళ్లతో సున్నితంగా తొలగించాలి. ఇలా చేయడం వల్ల మొక్క ఒక్క కొమ్మలా పైకి పెరగకుండా కింది భాగాల నుంచి కొత్త కొమ్మలు రావడం మొదలవుతాయి. దీంతో తులసి మొక్క చిన్నగా పొదలా దట్టంగా మారుతుంది. అలాగే మొక్కకు పూలు లాగా వచ్చినప్పుడు వాటిని ఎప్పటికప్పుడు తొలగించడం కూడా చాలా అవసరం. ఇలా చేయడం వల్ల మొక్కలోని పోషకాలు విత్తనాల తయారీకి కాకుండా కొత్త ఆకులు, కొమ్మల పెరుగుదలకు ఎక్కువగా ఉపయోగపడతాయి.
రోజూ నీళ్లు పోయకండి..
వర్షాకాలంలో తులసి మొక్కకు ఎక్కువగా నష్టం కలిగించేది అవసరానికి మించి నీరు అందించడం. వరుసగా వర్షాలు పడుతుంటే కుండీలోని మట్టి తడిగా ఉంటుంది. అలంటి సమయంలో మరింత నీరు పోయాల్సిన అవసరం లేదు. నీరు పొసే ముందు వేలు పెట్టి మట్టి పై పొరను పరిశీలించండి. మట్టి పొడిగా అనిపిస్తేనే నీరు పోయాలి. అలాగే కుండీ అడుగుభాగంలో నీరు బయటకు వెళ్లేందుకు సరైన రంధ్రాలు తప్పనిసరిగా ఉండాలి. కుండీలో నీరు ఎక్కువసేపు నిలిచిపోతే తులసి వేర్లు కుళ్లిపోయే ప్రమాదం ఉంటుంది.
వెలుతురు ఖచ్చితం:
తులసి మొక్క ఆరోగ్యంగా పెరగడానికి తగినంత సూర్యకాంతి అవసరం. వర్షాకాలంలో ఆకాశం ఎక్కువగా మేఘావృతమై ఉండటంతో మొక్కకు తగినంత వెలుతురు అందకపోవచ్చు. అందుకే వీలైనంత ఎక్కువ సహజ వెలుతురు లభించే ప్రదేశంలో తులసి కుండీని ఉంచాలి. వీలైతే ప్రతిరోజూ కొన్ని గంటల పాటు సూర్యరశ్మి తగిలే ప్రదేశంలో ఉంచడం మంచిది. తగినంత వెలుతురు అందితే ఆకులు మంచి పచ్చని రంగులో ఉండటంతో పాటు కొత్త కొమ్మలు, ఆకుల పెరుగుదల కూడా మెరుగ్గా ఉంటుంది.
నీరు నిల్వ ఉండని మట్టి:
తులసి మొక్కను దట్టంగా పెంచడానికి కేవలం ఎరువులు వేయడం సరిపోదు. మట్టి నాణ్యత, డ్రైనేజీ కూడా చాలా ముఖ్యం. గమలంలోని మట్టిలో నీరు ఎక్కువసేపు నిల్వ ఉండకుండా సులభంగా బయటకు వెళ్లేలా చూసుకోవాలి. దీని కోసం సాధారణ గార్డెన్ మట్టిలో కొంత ఇసుక లేదా ఇతర డ్రైనేజీ పదార్థాలతో పాటు బాగా కుళ్లిన సేంద్రియ ఎరువును కలపవచ్చు. ఇలా చేయడం వల్ల మట్టి మరీ బిగుతుగా మారకుండా ఉండటంతో పాటు వేర్లకు గాలి సరిగ్గా అందుతుంది. వర్షాకాలంలో ఈ జాగ్రత్త మరింత అవసరం.
సేంద్రియ ఎరువు:
వర్షాకాలంలో తులసి మొక్క వేగంగా పెరుగుతున్న సమయంలో సరైన పోషకాలు కూడా అవసరం. ఇందుకోసం అప్పుడప్పుడు వర్మీకంపోస్ట్ లేదా బాగా కుళ్లిన సేంద్రియ ఎరువును కొద్దిగా మట్టిలో కలపవచ్చు. అయితే ఎరువును ఎక్కువగా వేయడం వల్ల ప్రయోజనం కంటే నష్టమే కలగవచ్చు. కాబట్టి మొక్క పరిమాణం, మట్టి పరిస్థితిని బట్టి తక్కువ మొత్తంలో మాత్రమే ఎరువును ఉపయోగించడం మంచిది.
పసుపు ఆకులు:
తులసి మొక్క ఎక్కువ ఆకులు, కొమ్మలతో దట్టంగా పెంచాలనుకుంటే ఎండిపోయిన, పసుపు రంగులోకి మారిన లేదా దెబ్బతిన్న ఆకులను కూడా తొలగిస్తూ ఉండాలి. దీంతో మొక్కలోని పోషకాలు ఆరోగ్యకరమైన కొత్త ఆకులు, కొమ్మల పెరుగుదలకు ఉపయోగపడతాయి.