
World Record: అఫ్గానిస్థాన్ యంగ్ క్రికెటర్ సెదికుల్లా అటల్ తన 25వ పుట్టినరోజు నాడు అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన రికార్డును నెలకొల్పాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఆల్‌టైమ్ ప్రపంచ రికార్డును తిరగరాశాడు.దీంతో ప్రపంచ దృష్టి అతడి మీద పడింది. తిప్పుకున్నాడు. సెదికుల్లా అటల్ బెల్ఫాస్ట్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన నాలుగో వన్డేలో తన విశ్వరూపం చూపించాడు. బర్త్ డే రోజు మైదానంలోకి దిగి కేవలం 120 బంతుల్లో 17 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 143 పరుగులు సాధించాడు. ఈ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో వన్డే క్రికెట్ చరిత్రలో పుట్టిన రోజు నాడు అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన బ్యాటర్‌గా ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నాడు. గతంలో 2022లో న్యూజిలాండ్ ఆటగాడు టామ్ లాథమ్ నెదర్లాండ్స్‌పై తన 30వ పుట్టినరోజున చేసిన 140 పరుగుల రికార్డును అటల్ అధిగమించాడు.
సచిన్, విరాట్ కోహ్లీల రికార్డులు కూడా కనుమరుగు
ఈ ఇన్నింగ్స్‌తో అటల్ క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్‌ను సైతం దాటేశాడు. సచిన్ టెండూల్కర్ 1998లో ఆస్ట్రేలియా మీద తన 25వ పుట్టినరోజున 134 పరుగులు చేశాడు. ఆ రికార్డు ప్రస్తుతం మూడో స్థానానికి పడిపోయింది. బర్త్ డే రోజున వన్డేల్లో తొలి సెంచరీ చేసిన రికార్డు భారత్‌కే చెందిన వినోద్ కాంబ్లీ (1993లో ఇంగ్లాండ్‌పై 100 నాటౌట్) పేరిట ఉండగా, విరాట్ కోహ్లీ కూడా 2023లో సౌతాఫ్రికాపై తన 35వ పుట్టినరోజున 101 పరుగులు చేసి సెంచరీ సాధించాడు. వీరందరినీ దాటుకుని అటల్ ఇప్పుడు అగ్రస్థానంలో నిలవడం విశేషం.
ఇబ్రహీం జద్రాన్ రికార్డు భాగస్వామ్యం
ఈ మ్యాచ్‌లో అటల్ మరో ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్‌తో కలిసి రెండో వికెట్‌కు 231 పరుగుల రికార్డు పార్టనర్ షిప్ నెలకొల్పాడు. అఫ్గానిస్థాన్ వన్డే చరిత్రలోనే రెండో వికెట్‌కు అత్యధిక పార్టనర్ షిప్ ఇదే కావడం గమనార్హం. జద్రాన్ కూడా 107 పరుగులతో మెరిసి వన్డేల్లో వేగంగా 2000 పరుగులు పూర్తి చేసిన మూడో ఆసియా బ్యాటర్‌గా నిలిచాడు. వీరిద్దరి విజృంభణతో అఫ్గానిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 343 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఐర్లాండ్ 48 ఓవర్లలో 301 రన్స్ చేసి ఆలౌట్ అయ్యింది. దీంతో ఆఫ్గానిస్థాన్ 42 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో 5 వన్డేల సిరీస్‌ను అఫ్గానిస్థాన్ 3-0 తేడాతో ఖాయం చేసుకుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..