
- ఏజెన్సీ ప్రాంతాల్లో జనాభాతో సంబంధం లేకుండా దూరాన్ని బట్టి హాస్పిటల్స్
- ప్రతి 5 నుంచి -10 కిలోమీటర్లకో హెల్త్ సెంటర్
- 108 వెళ్ల లేని గూడేలకు బైక్ అంబులెన్స్‌లు
- మాతాశిశు మరణాలపై కలెక్టర్ల డెత్ ఆడిట్ తప్పనిసరి
- గర్భిణుల కోసం బర్త్ వెయిటింగ్ హోమ్స్
హైదరాబాద్, వెలుగు: సకాలంలో వైద్యం అందక ఇబ్బంది పడుతున్న గిరిపుత్రులకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ‘ట్రైబల్ హెల్త్ పాలసీ’ని తీసురాబోతోంది. రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆదివాసీలకు దశాబ్దాలుగా వైద్య సేవలు అంతంతమాత్రంగానే అందుతున్నాయి. ఈ సమస్యను సమూలంగా రూపుమాపేందుకు ప్రభుత్వం ఈ పాలసీని రూపొందించింది. ఇప్పటివరకు జనాభా ప్రాతిపదికన హాస్పిటల్స్‌ను కేటాయించే వారు.
ఏజెన్సీలో భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా ఈ పద్ధతిని పక్కన పెట్టి దూరాన్ని ప్రామాణికంగా తీసుకోనుంది. దీంతో వేలల్లో జనాభా ఉండాలనే నిబంధనతో పని లేకుండా, ప్రతి 5 నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో ఒక హెల్త్ సెంటర్ అందుబాటులో ఉండేలా పాలసీ రూపొందిస్తున్నారు. గిరి పల్లెలకు సరైన రోడ్లు లేక అంబులెన్స్‌లు వెళ్లలేని పరిస్థితి ఉంది. ఈ సమస్యను అధిగమించేందుకు 108 వెళ్లలేని ఇరుకైన దారులు, కొండ మార్గాల్లో వెళ్లేందుకు బైక్ అంబులెన్స్, ఫీడర్ సర్వీసులను అందుబాటులోకి తీసుకురానున్నారు.
మరణాల నివారణకు డెత్ ఆడిట్..
ట్రైబల్ ఏరియాల్లో మాతా, శిశు మరణాల రేటును తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం కఠిన నిబంధనలను అమలు చేయబోతోంది. ఏజెన్సీలో ఏ ఒక్క గర్భిణీ, శిశువు మరణించినా, దానికి గల కారణాలపై కలెక్టర్ల ఆధ్వర్యంలో డెత్ ఆడిట్ నిర్వహించడం ఇకపై తప్పనిసరి కానుంది.
గర్భిణులు ప్రసవ సమయానికి హాస్పిటల్‌కు చేరడంలో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించేందుకు బర్త్ వెయిటింగ్ రూల్స్ ను ప్రభుత్వం బలోపేతం చేయనుంది. కాన్పుకు 15 రోజుల ముందే గర్భిణులు 102 వెహికల్ ద్వారా ఈ సెంటర్లకు చేరుకునేలా చూసి, అక్కడ వారికి ఉచిత వసతితో పాటు బలవర్ధకమైన ఆహారాన్ని అందించనున్నారు.
గిరిజనులను ఎక్కువగా వేధిస్తున్న సికిల్ సెల్, ఎనీమియా, రక్తహీనత నిర్మూలనకు ప్రత్యేక నిధులను కేటాయించడమే కాకుండా, వైద్య బృందాలు ప్రతి ఇంటికీ వెళ్లి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ వ్యాప్తి చెందకుండా ముందస్తుగా మందులు, సిబ్బందిని సిద్ధం చేయనున్నారు.
డాక్టర్లకు ఇన్సెంటివ్‌లు..
ఏజెన్సీ ప్రాంతంలోని దవాఖానాల్లో డాక్టర్ల కొరతను నివారించేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మారుమూల ప్రాంతాల్లో పని చేసే వైద్యులకు, సిబ్బందికి సాధారణ జీతం కంటే 30 నుంచి 50 శాతం అదనపు ఇన్సెంటివ్ లు ఇచ్చేలా పాలసీని రూపొందిస్తున్నట్లు సమాచారం.
అంతేకాకుండా ఏజెన్సీలో సేవలు అందించిన డాక్టర్లకు పీజీ ఎంట్రన్స్ లో వెయిటేజీ మార్కులు ఇవ్వడంతో పాటు వారు అక్కడే నివసించేలా అన్ని సౌలతులతో క్వార్టర్లను నిర్మించనున్నట్లు తెలుస్తోంది. వైద్య సేవల్లో భాషాపరమైన సమస్యలు తలెత్తకుండా స్థానిక గిరిజన యువతనే హెల్త్ వలంటీర్లుగా నియమించుకొని వారికి శిక్షణ ఇవ్వనున్నారు.
ఐటీడీఏ పరిధిలోని హాస్పిటళ్లను మల్టీ స్పెషాలిటీ లెవల్ కు అప్‌గ్రేడ్ చేయడంతో పాటు టెలీ మెడిసిన్ సేవలను ప్రతి పీహెచ్‌సీకి విస్తరించనున్నారు. దీంతో గిరిజన పల్లె నుంచే రోగి హైదరాబాద్ నిమ్స్ డాక్టర్లతో వీడియో కాల్‌లో మాట్లాడి చికిత్స పొందే వీలుంటుంది. ఈ సరికొత్త పాలసీ ఏజెన్సీ వైద్య పరిస్థితుల్లో సమూల మార్పులు తీసుకొస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.