Reading Time: 2 minutes
Crispy Beetroot Dosa Recipe Easy And Healthy Breakfast Recipe

Beetroot Dosa: రోజువారీ ఉదయం అల్పాహారంలో (Tiffins) కొత్తదనం, రుచి, ఆరోగ్యం కలగలిపిన వంటకం కోసం చూస్తున్నారా..? అయితే రొటీన్ కు బిన్నంగా ఎప్పుడు తినే మసాలా దోస కాకుండా ఈ క్రిస్పీ & హెల్దీ బీట్‌రూట్ దోసను ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తినే ఈ కలర్‌ ఫుల్ దోస తయారీ విధానం చాలా సులభం. మరి అది ఎలాగో చూసేద్దామా..

కావలసిన పదార్థాలు:

పప్పులు, బియ్యం నానబెట్టుకోవడానికి:

* మినపప్పు: 1 కప్పు
* బియ్యం: 3 కప్పులు
* శనగపప్పు: 1 టేబుల్ స్పూన్
* మెంతులు: కొద్దిగా (1/4 టీస్పూన్)

రుబ్బేటప్పుడు (మిక్సీలో) వేయవలసినవి:

* బీట్‌రూట్: 1 (పెద్ద ముక్కలుగా తరిగినది)
* పచ్చిమిర్చి: 6
* అల్లం: 1 అంగుళం ముక్క
ఉప్పు: అర టీస్పూన్ (తగినంత)
నీరు: తగినంత

దోస కాల్చడానికి..

* నూనె: తగినంత

తయారీ విధానం:

ఒక పాత్రలో 1 కప్పు మినపప్పు, 3 కప్పుల బియ్యం, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, కొద్దిగా మెంతులు తీసుకోండి. ఆ తర్వాత వాటిని మంచి నీరు పోసి 6 నుండి 8 గంటల పాటు బాగా నాననివ్వాలి. బాగా నానిన బియ్యం-పప్పుల మిశ్రమాన్ని నీరు తీసివేసి మిక్సీ జార్‌లోకి తీసుకోండి.

ఇప్పుడు అందులోనే తరిగిన బీట్‌రూట్ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం ముక్క, ఉప్పు వేయండి. ఇందులోనే కాస్త కొద్దిగా నీరు చేర్చి, మెత్తని దోస పిండిలా బాగా గ్రైండ్ చేయండి. ఇప్పుడు సిద్ధమైన పింక్ రంగు దోస పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని కన్సిస్టెన్సీ (పిండి చిక్కదనం) సరిచూసుకోండి. అవసరమైతే కాస్త నీటిని జోడించండి.

దోస పిండి రెడీ అయ్యింది కాబట్టి ఇప్పుడు దోస పెనాన్ని (Pan) పొయ్యి మీద పెట్టి బాగా వేడి చేయండి. పెనం వేడెక్కాక, ఒక గరిటెడు బీట్‌రూట్ పిండిని పెనం మధ్యలో వేసి గుండ్రంగా పల్చగా పరచండి. దోస చుట్టూరా, పైన 1 టీస్పూన్ నూనె వేయండి చాలు. మంటను మధ్యస్త మంటలో ఉంచి 2 నుండి 3 నిమిషాల పాటు క్రిస్పీగా అయ్యే వరకు దోసను కాల్చండి. అంతే క్రిస్పీ బీట్‌రూట్ దోస రెడీ..

ఎంతో క్రిస్పీగా, ఆకర్షణీయమైన రంగులో ఉండే వేడి వేడి బీట్‌రూట్ దోసను కొబ్బరి చట్నీతో గానీ లేదా అల్లం చట్నీతో గానీ వేడిగా వడ్డిస్తే అద్భుతంగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి ఇచ్చే ఈ బీట్‌రూట్ దోసను తప్పకుండా ఇంట్లో వారానికి ఒకసారి ప్రయత్నించండి.