Reading Time: < 1 minute
Ap Cm Chandrababu Naidu To Review Law And Order With 1300 Police Officials

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు రాష్ట్ర సచివాలయంలో సీఎం అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. పోలీస్ శాఖలోని అన్ని స్థాయిల అధికారులను ఈ సమీక్షకు భాగస్వాములను చేస్తున్నారు. డీజీపీ నుంచి క్షేత్రస్థాయిలో పనిచేసే స్టేషన్ హౌస్ ఆఫీసర్ల వరకు సుమారు 1,300 మంది అధికారులు సమావేశంలో పాల్గొననున్నారు. ఉన్నతాధికారులు సచివాలయంలో ప్రత్యక్షంగా హాజరుకానుండగా.. జిల్లాల్లోని అధికారులు, ఎస్‌హెచ్‌ఓలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొంటారు.

రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి, మహిళలు, చిన్నారులపై నేరాల కట్టడి, సైబర్ క్రైమ్, సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న నేరాలు, బ్లేడ్, గంజాయి బ్యాచ్‌ల ఆగడాలకు అడ్డుకట్ట వంటి అంశాలపై సీఎం సమీక్షించనున్నారు. పోలీస్ స్టేషన్ల పనితీరు, నమోదవుతున్న కేసులు, క్షేత్రస్థాయిలో శాంతిభద్రతల నిర్వహణపై సీఎం వద్ద ఉన్న నివేదికలను అధికారుల ముందుంచి విశ్లేషించనున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, మహిళలు, చిన్నారులు, బలహీన వర్గాల రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. క్షేత్రస్థాయి సమస్యలు, పోలీసుల పనితీరు, నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.