Reading Time: 2 minutes
క్రైమ్ థ్రిల్లర్స్‌ను మించి.. తండ్రిని చంపి బాడీని మాయం చేసిన కొడుకు.. పోలీసులు ఎలా కనిపెట్టారంటే?

కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రిని, ఓ కఠినాత్ముడైన కొడుకు పథకం ప్రకారం హత్య చేసి, ఆపై ఏమీ తెలియనట్లు నమ్మించే ప్రయత్నం చేశాడు. తన తండ్రి కనిపించకుండా పోయాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చట్టం చేతికి దొరక్కుండా సూపర్ డ్రామా ఆడాడు. కానీ చివరికి పాపం పండి కటకటాలపాలయ్యాడు. పోలీసులు తమదైన స్టైల్ లో విచారణ చేయడంతో అసలు గుట్టు రట్టైంది. తండ్రిని నమ్మించి అత్యంత దారుణంగా హత్య చేసిన కొడుకు భాగోతం బట్టబయలైంది.

వివరాల్లోకి వెళితే‌.. మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన లక్ష్మణ్ అనే వ్యక్తికి, ఆయన కుమారుడు ఉదయ్ కి మధ్య కొంతకాలంగా కుటుంబ కలహాలు నడుస్తున్నాయి. ఈ గొడవలే కొడుకు ఉదయ్ మనసులో తండ్రి లక్ష్మణ్ పై తీవ్రమైన కక్షను పెంచాయి. తండ్రిని ఎలాగైనా ప్రాణాలతో లేకుండా చేయాలని కుమారుడు ఉదయ్ పక్కా స్కెచ్ వేశాడు. .

గత నెల 21న ఉదయ్ తన తండ్రి లక్ష్మణ్‌ను బైక్‌పై ఎక్కించుకొని భీమారం మండలం శివారులోని గొల్లవాగు ప్రాజెక్టు వద్దకు తీసుకెళ్లాడు. చుట్టూ ఎవరూ లేని సమయం చూసి తండ్రిపై ఒక్కసారిగా దాడి చేశాడు. కన్న తండ్రి అని కూడా చూడకుండా ఆయన గొంతు పిసికి అక్కడికక్కడే ఊపిరి తీసేశాడు. క్షణాల్లో తండ్రిని కాటికి పంపించేశాడు.

హత్య చేసిన తర్వాత దొరికిపోతాననే భయంతో ఉదయ్ మరో దారుణానికి ఒడిగట్టాడు. తండ్రి చనిపోయాడని నిర్దారించుకున్న ఉదయ్.. మృతదేహాన్ని ఎవరు గుర్తు పట్టకుండా పెట్రోల్‌ను మృతదేహంపై పోసి నిప్పంటించాడు. శరీరం కాలిన తర్వాత అక్కడి నుంచి ఏమీ తెలియనట్లు జారకున్నాడు.

అక్కడితో ఆగితేనా.. హత్య చేసిన మరుసటి రోజు నుంచే ఉదయ్ పెద్ద నాటకానికి తెరలేపాడు.. తన తండ్రి లక్ష్మణ్ కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులను నమ్మించాడు. అందరినీ వెంటబెట్టుకొని చెన్నూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. “మా నాన్న కనిపించడం లేదు, వెతికి పెట్టండి” అంటూ స్వయంగా పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు ఆ దుర్మార్గుడు.

పోలీసులు మిస్సింగ్ కేస్ నమోదు చేసి విచారణ జరుపుతుండగా.. గత నెల జూలై 30న గొల్లవాగు అటవీ ప్రాంతంలో తీవ్రంగా కాలిన స్థితిలో ఉన్న ఒక మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులను పిలిపించగా, అది లక్ష్మణ్ మృతదేహమేనని వారు నిర్ధారించారు.

కేసును సీరియస్‌గా తీసుకున్న జైపూర్ సీఐ నవీన్ కుమార్.. మూడు టీంల సాయంతో సమగ్ర విచారణ చేపట్టారు.. ఉదయ్ ప్రవర్తనపై అనుమానం రావడంతో అతడిని తమదైన శైలిలో విచారించగా, అసలు నిజాలు బయటపడ్డాయి. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఉదయ్ తన తండ్రి లక్ష్మణ్‌ను పథకం ప్రకారం బైక్‌పై తీసుకెళ్లి గొంతు నులిమి హత్య చేశాడని, ఆ తర్వాత మృతదేహానికి నిప్పంటించి అదృశ్యమైనట్లు చిత్రీకరించడానికి ప్రయత్నించాడని విచారణలో స్పష్టమైంది. నిందితుడు ఉదయ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి,