Reading Time: < 1 minute

పాత పెన్షన్ విధానం అమలుకు కృషి చేస్తా

Caption of Image.
  • సీపీఎస్​ఈయూ నేతలతో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ 

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన హిమాచల్ ప్రదేశ్ తరహాలోనే తెలంగాణలోనూ పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) అమలుకు కృషి చేస్తానని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చారు. సోమవారం గాంధీ భవన్‌‌‌‌‌‌‌‌లో సీపీఎస్​ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం స్థిత ప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వాల్ శ్రీకాంత్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం మహేశ్ కుమార్ గౌడ్​ను కలిసి వినతిపత్రం అందజేసింది. కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఓపీఎస్ పునరుద్ధరణపై ఇచ్చిన హామీని యూనియన్ నాయకులు గుర్తు చేశారు. 

హిమాచల్ ప్రదేశ్‌‌‌‌‌‌‌‌లో అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి క్యాబినెట్ మీటింగ్‌‌‌‌‌‌‌‌లోనే ఓపీఎస్‌‌‌‌‌‌‌‌ను అమలు చేశారని, తెలంగాణలోనూ అదే నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఉద్యోగుల వినతిపై మహేశ్​గౌడ్ సానుకూలంగా స్పందించారు. ఓపీఎస్​ అమలు అనేది కాంగ్రెస్ పార్టీ జాతీయ ఎజెండాలో ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఓపీఎస్ అమలు చేశామనీ,  తెలంగాణలోనూ దీనిపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టితో చర్చించి, ఉద్యోగులకు సానుకూల నిర్ణయం వచ్చేలా తన వంతు కృషి చేస్తాననని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సీపీఎస్​ఈయూ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మల్లికార్జున్, హైదరాబాద్ జిల్లా కోశాధికారి శ్యామ్ సుందర్ పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.