
ఫుకెట్, ఢిల్లీ విమానం ప్రమాదం ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి రావడంతో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎయిర్ ఇండియాలో పైలట్లందరికీ డోపింగ్ టెస్టులు చేయాలని నిర్ణయించింది. దీంతో టాటా గ్రూప్ లోని రెండు ఎయిర్ లైన్స్ లో పనిచేస్తున్న దాదాపు 5 వేల మంది పైలట్లకు టెస్టులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇవాళ్టి(గురువారం ఆగస్టు13) నుంచే ఈ టెస్టులను నిర్వహించనున్నట్లు సంస్థ వర్గాలు చెబుతున్నాయి.
టాటా గ్రూప్ కు చెందిన ఈ రెండు ఎయిర్ లైన్స్ సంస్థల 5వేల మందికి పైగా పైలట్లు ఉన్నారు. ఫుకెట్, ఢిల్లీ ఎయిర్ ఇండియా ప్రమాదం తర్వాత జరిగిన పరిణామాలతో పైలట్లందరికీ డోపింగ్ టెస్టులు నిర్వహించాలని రెండు సంస్థలు పైలట్లకు పంపిన మేసేజ్ లో తెలిపాయి. వీరితోపాటు గురుగ్రామ్ అకాడమీలో శిక్షణతోపాటు విమాన ప్రయాణం తర్వాత ఫ్లైట్ బ్రీఫింగ్ సెంటర్లలో , ఎయిర్ లైన్ ఆఫీసుల్లో స్క్రీనింగ్ నిర్వహించనున్నారు.
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ రూల్స్ ప్రకారం.. విమాన సిబ్బంది డ్యూటీకి 12 గంటల ముందు మద్యం తాగకూడదు.. డ్రగ్స్ తీసుకోకూడదు, విమాన ప్రయాణ సమయంలో కూడా అలాంటి ఉత్తేజరపరిచే పదార్థాలను సేవించడం నిషేధించారు.
ఆగస్టు 4న పుకెట్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.. ఈ ఘటనలో ఎయిర్ ఇండియా సిబ్బందితో సహా 13మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. విమానం ఆకాశంలో ప్రయాణిస్తుండగానే కుదుపులతో దాదాపు 300 అడుగుల కిందికి దిగడంతో ప్రయాణికులు ఒకరిపై ఒకరు పడి తీవ్రంగా గాయపడ్డారు. అయితే కొద్దిసేపటికు తిరిగి యధాస్థితికి విమానం చేరుకుని ల్యాండ్ అవడంతో గాయాలతో ప్రయాణికులు బయటపడ్డారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన డీజీసీఐ విచారణకు ఆదేశించింది. ఘటనకు కారణమైన ఇద్దరు పైలట్లను సస్పెండ్ చేసింది ఎయిర్ ఇండియా. దీంతో పాటు పైలట్లకు డోపింగ్ టెస్టులు చేయగా ఓ పైలట్ రెండుసార్లు డోపింగ్ టెస్టులో ఫెయిల్ అయ్యాడు. దీంతో టాటా గ్రూప్ లో ఉన్న రెండు ఎయిర్ లైన్స్ సంస్థలలో పనిచేస్తున్న 5వేల మంది పైలట్లకు డోపింగ్ టెస్టులకు దారి తీసింది.