
తలపై జుట్టు ఉంటేనే అందం.. అది ఆడవారికైనా.. మగవారికైనా.. అందమైన మెరిసే జుట్టు.. చూపరులను ఇట్టే ఆకట్టుకుంటుంది.. అందుకే చాలామంది ఒత్తయిన, మెరిసే జుట్టుకోసం తహతహలాడుతుంటారు. అలాంటి జుట్టున్న వారిని పొగడ్తలతో ముంచెత్తుతుంటారు. ఇక ఆడవాళ్లు అందమైన, ఒత్తయిన, మెరిసే జుట్టుకోసం చేయని ప్రయత్నమంటూ ఉండదు.. ఇంటర్నెట్ రాకముందు పుస్తకాలు, మ్యాగజైన్లు.. ఇప్పుడు యూట్యూబ్ సెర్చ్ చేయని హెల్త్ వెబ్ సైట్ ఉండదు. అంత ప్రాముఖ్యత జుట్టుకుంది. మరి వంటింట్లో దొరికే ఇంగ్రీడియెంట్స్ తో మెరిసే జుట్టును పొందవచ్చని మనోళ్లు చాలా చిట్కాలు చెబుతున్నారు. అవేంటో చూద్దాం..
రద్దీ నగరాల్లో కాలుష్యం, చెమట వల్ల జుట్టు కొంత వరకు దెబ్బతింటుంది. అలాగే నూనె అంటుకోకున్నా కూడా వెంట్రుకలు పొడిగా కనిపిస్తాయి. ఈ సమస్య రాకూడదంటే అప్పుడప్పుడు హెయిర్ ప్యాక్స్ వేసుకోవాలంటున్నారు.. అటువంటి హెయిర్ ప్యాక్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
తయారీ విధానం..
ఓ గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్, కొంచెం అలొవెరా జెల్, గుడ్డు పచ్చ సొనలు రెండు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకి పట్టించి పది-పదిహేను నిమిషాలు మసాజ్ చేసి, వదులుగా కొప్పు వేసుకోవాలి. షవర్ క్యాప్ పెట్టుకున్నా సరిపోతుంది. రాత్రంతా హెయిర్ ప్యాక్ ని అలాగే ఉంచాలి. ఉదయాన్నే షాంపూతో వెంట్రుకల్ని శుభ్రం చేసుకోవాలి.
జడ వేసుకున్న తీరు కూడా వెంట్రుకల్ని దెబ్బతీస్తుంది. రాత్రిపూట కొంచెం లూజ్ గా జడ వేసుకోవాలి. అలాగే తలస్నానం చేసిన వెంటనే పడుకోకూడదు. తల పూర్తిగా ఆరాకే పడుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే జుట్టు అందంగా, మెరుస్తూ, ఒత్తుగా పెరుగుతుందని సలహా ఇస్తున్నారు సౌందర్య నిపుణులు.