
- ఒక్క కరీంనగర్ నియోజకవర్గంలోనే 90 వేల ఓట్లపై ‘సర్’ ప్రభావం
- ముగిసిన సర్ ఎన్యూమరేషన్ ఫామ్ ల ఆన్ లైన్ ప్రక్రియ
కరీంనగర్, వెలుగు: సర్ ప్రక్రియతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఓట్లు భారీగా తగ్గిపోయాయి. ఎన్యుమరేషన్ ఫామ్ల ఆన్లైన్ ప్రక్రియకు చివరి రోజైన సోమవారం సాయంత్రం 6 గంటల వరకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొత్తం 29,97,973 మంది ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫామ్(ఈఎఫ్) లు పంపిణీ చేయగా.. 26,05,675 మంది ఓటర్లు తమ ఫామ్ లను తిరిగి బూత్ లెవల్ ఆఫీసర్లకు అప్పగించారు. దీంతో ఈ ఫామ్లను మాత్రమే ఆన్లైన్ చేశారు.
ఇంకా 3,92,298 మంది ఓటర్ల నుంచి ఎన్యుమరేషన్ ఫామ్లు తిరిగి రాలేదు. వీటిని అన్ కలెక్టబుల్ ఓట్లుగా గుర్తించారు. వీటిలో ఎక్కువగా మరణించిన ఓటర్లు, ఇతర ప్రాంతాలకు తమ ఓటు తరలించుకున్నవాళ్లు, డబుల్ ఓట్లు కలిగిన వాళ్లు ఉన్నారు. ఈ ఓట్లన్నీ జాబితా నుంచి తొలగిపోనున్నాయి. వీటిని తొలగించి ముసాయిదా ఓటరు జాబితాను అధికారులు సిద్ధం చేయనున్నారు.
జిల్లాల వారీగా ఇలా..
కరీంనగర్ జిల్లాలో 10,89,090 మంది ఓటర్లు ఉండగా.. 9,11,445 మంది ఓటర్లు మాత్రమే తమ ఎన్యుమరేషన్ ఫామ్లు బీఎల్వోలకు ఇచ్చారు. ఇందులో 1,77,645 మంది ఫామ్లు తిరిగి ఇవ్వలేదు. ఒక్క కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని 3,68,832 ఓట్లర్లలో 90 వేలకుపైగా అన్ కలెక్టబుల్ జాబితాలో ఉన్నట్లు తెలిసింది. పెద్దపల్లి జిల్లాలో సర్ ప్రక్రియ ప్రారంభం నాటికి 7,12,157 ఓట్లు ఉండగా 6,30,930 మంది ఓటర్లు తమ ఫామ్లు బీఎల్వోలకు సమర్పించి ఆన్ లైన్ చేయించుకున్నారు.
ఇంకా ఈ జిల్లాలో 81,227 మంది ఓటర్లు తమ ఫామ్ లు తిరిగి ఇవ్వలేదు. జగిత్యాల జిల్లాలో ఓటరు జాబితాలో మొత్తం 7,21,032 మంది ఓటర్లు ఉండగా.. 6,46,138 మంది ఓటర్ల ఎన్యుమరేషన్ ఫామ్ లు అందగా.. 74,894 మంది ఓటర్లు ఫామ్ లు రిటర్న్ చేయలేదు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 4,75,694 మంది ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫామ్ లు పంపిణీ చేయగా 4,17,162 ఫామ్ లు రిటర్న్ రావడంతో ఆన్లైన్ చేశారు. ఈ జిల్లాలో ఫామ్లు తిరిగి ఇవ్వని 58,532 ఓట్లను తొలగించనున్నారు. ఈ నెల 17న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రదర్శించనున్నారు.