
ముంబై మలాడ్ వెస్ట్‌లో ఉన్న బ్లింకిట్ క్విక్ కామర్స్ స్టోర్‌పై మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు నిర్వహించిన తనిఖీలు షాకింగ్ విషయాలను బయటపెట్టాయి. కస్టమర్లకు నిమిషాల్లోనే సరుకులు డెలివరీ చేస్తామనే సంస్థ స్టోర్‌లో ఫుడ్ సేఫ్టీ, పరిశుభ్రత ప్రమాణాలు మాత్రం అద్వానంగా ఉన్నట్లు తనిఖీలో బయటపడింది. ముఖ్యంగా పండ్లు, కూరగాయలపై పెద్ద సంఖ్యలో బొద్దింకలు కనిపించడంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆహార పదార్థాలను నేలపై నేరుగా ఉంచడం, తుప్పుపట్టిన ర్యాక్‌లు, నీట్ గా లేని కోల్డ్ స్టోరేజ్ ప్రాంతాలు, సరైన కీటకాలు–ఎలుకల నియంత్రణ లేకపోవడం వంటి అనేక ఉల్లంఘనలు బయటపడ్డాయి.
ఎక్స్‌పెయిరీ అయిన సరుకులు..
ఆగస్టు 7న జరిగిన తనిఖీలో కొన్ని ఆహార ఉత్పత్తులు గడువు ముగిసినప్పటికీ స్టోర్‌లోనే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మరికొన్ని ఉత్పత్తులు దెబ్బతిన్న స్థితిలో ఉండగా.. కొన్ని ప్యాకెట్లు ట్యాంపర్ చేసినట్టుగా కనిపించాయి. ఆహార పదార్థాలను నిల్వ చేసే సమయంలో తప్పనిసరిగా పాటించాల్సిన ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్, ఫస్ట్ ఎక్స్ పెయిరీ ఫస్ట్ ఔట్ విధానాలు కూడా ఫాలోకావట్లేదట. దీంతో గడువు సమీపిస్తున్న ఉత్పత్తులు వినియోగదారులకు చేరే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమైంది.
సిబ్బంది హెల్త్ రికార్డ్స్ నిర్లక్ష్యం..
ఆహార పదార్థాలను నిర్వహించే స్టోర్ ఉద్యోగుల వ్యక్తిగత పరిశుభ్రత విషయంలోనూ లోపాలు గుర్తించారు. సిబ్బందికి నిర్వహించాల్సిన వైద్య పరీక్షలు, హెల్త్ రికార్డులు సక్రమంగా లేవని.. అవసరమైన పర్సనల్ సేఫ్టీ పరికరాలు కూడా తగిన స్థాయిలో అందుబాటులో లేవని FDA అధికారులు పేర్కొన్నారు. వ్యర్థాల నిర్వహణలోనూ లోపాలు ఉన్నట్లు గుర్తించారు. మొత్తంగా ఆహార భద్రతకు సంబంధించిన రూల్స్ పాటించకపోవడంతో అధికారులు కఠిన చర్యలకు దిగారు.
బ్లింకిట్ ఫుడ్ లైసెన్స్ సస్పెండ్
తనిఖీలో బయటపడిన విషయాల ఆధారంగా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్, 2006లోని సెక్షన్ 32(3) కింద బ్లింకిట్ స్టోర్ ఫుడ్ లైసెన్స్‌ను మహారాష్ట్ర FDA సస్పెండ్ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అక్కడ ఫుడ్ బిజినెస్ కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశించింది.
చర్యలు ఒక్క బ్లింకిట్ స్టోర్‌కే పరిమితం కాలేదు. కమిషనర్ తుకారాం ముంఢే ఆధ్వర్యంలో మే 25 నుంచి జూలై 31 వరకు ముంబైలో 3వేల 137 హోటళ్లు, రెస్టారెంట్లు, తినుబండారాల కేంద్రాలు, ఇతర ఆహార సంస్థలను FDA అధికారులు తనిఖీ చేశారు. మొత్తం 764 ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు జారీ చేయగా.. 165 ఫుడ్ లైసెన్సులు సస్పెండ్ చేశారు. సుమారు 28 లక్షల 66వేల కిలోల ఆహార ఉత్పత్తులను డిస్పోజ్ చేశారు. వీటి విలువ దాదాపు రూ.55 కోట్లుగా ఉంది.
తప్పులు సరిదిద్దుకుంటే తిరిగి అవకాశం..
అయితే లైసెన్స్ సస్పెన్షన్ శాశ్వతంగా వ్యాపారం మూసివేయడమని భావించాల్సిన అవసరం లేదని తుకారాం ముంఢే స్పష్టం చేశారు. తప్పులను సరిదిద్దుకునేందుకు సంస్థలకు అవకాశం ఉంటుందని, అనంతరం FDA తనిఖీలు, విచారణ నిర్వహించి తదుపరి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. 165 సస్పెన్షన్లలో 103 సంస్థలు అప్పీల్ చేసుకోగా, నిబంధనలను పాటించినట్లు నిర్ధారణైన అర్హత కలిగిన కేసుల్లో మధ్యంతర ఉపశమనం ఇచ్చినట్లు వెల్లడించారు. ఆహార నాణ్యత, పరిశుభ్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేస్తూ.. ఇలాంటి విషయాలపై ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేసింది ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్.