
తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ నటుడు రాజశేఖర్ తన సినిమాలకు ఆలస్యంగా హాజరవుతారనే అపఖ్యాతిపై ఒక ఇంటర్వ్యూలో వివరంగా స్పందించారు. తన ఆలస్యం వెనుక తన వ్యక్తిగత ఆరోగ్యం, నరాల బలహీనత వంటి బలమైన కారణాలున్నాయని ఆయన స్పష్టం చేశారు. కేవలం నిర్లక్ష్యం కాదని, అనారోగ్య సమస్యలే తనను వెంటాడుతున్నాయని ఆయన వివరించారు. రాజశేఖర్ తన ఆలస్యంపై మాట్లాడుతూ, “నేను కావాలని ఎప్పుడూ ఆలస్యం చేయలేదు. నాకు ఒక ప్రాబ్లం ఉంది కాబట్టి ఆలస్యంగా రావడం జరుగుతుంది. అది అర్థం చేసుకున్న వాళ్లు నాతో సినిమా చేయండి. లేదంటే నన్ను వదిలేయండి” అని తాను గతంలో చాలామంది నిర్మాతల ముందు తన పరిస్థితిని వివరించినట్లు తెలిపారు. తన వందేమాతరం సినిమా రోజుల నుంచే తన ఈ అలవాటు గురించి దర్శకుడు టి. కృష్ణకు కూడా తెలుసునని ఆయన పేర్కొన్నారు. తొమ్మిది గంటలకు రావాలంటే పదింటికి వస్తానని, అత్యధికంగా ఆలస్యమైతే గంటన్నర మాత్రమేనని, అంతకుమించి ఎప్పుడూ కాలేదని ఆయన అన్నారు. తనకు నరాల బలహీనత (నెర్వస్ నెస్) ఉందని రాజశేఖర్ వెల్లడించారు. ఈ సమస్య కారణంగా రాత్రి నిద్ర పట్టదని, దీనివల్లే ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (IBS) సమస్య కూడా తలెత్తిందని తెలిపారు.
“ప్రతి సినిమా నాకు కొత్త సినిమా లాగే అనిపిస్తుంది. ఆ టెన్షన్ నన్ను వెంటాడుతుంది. షూటింగ్‌కు ఆలస్యంగా వెళ్తున్నానే అనే ఆ టెన్షనే నా సమస్యను మరింత పెంచుతుంది” అని ఆయన వివరించారు. అయితే, మొదటి షాట్ పూర్తవగానే తాను సాధారణ స్థితికి వస్తానని, అప్పటివరకు మాత్రం ఒత్తిడికి గురవుతానని ఆయన పేర్కొన్నారు. తాను దర్శకనిర్మాతలను ఇబ్బంది పెడితే.. చిత్ర పరిశ్రమలో ఇన్నేళ్లు ఎలా కొనసాగగలిగానని ప్రశ్నించారు. కోడి రామకృష్ణ (పదికి పైగా సినిమాలు), ముత్యాల సుబ్బయ్య (పది సినిమాలు), పినిశెట్టి రవిరాజా (ఆరు సినిమాలు) వంటి ప్రముఖ దర్శకులు తనతో పదే పదే సినిమాలు చేశారని గుర్తు చేశారు. తాను నిజంగానే వృత్తి పట్ల నిబద్ధత లేకుండా ప్రవర్తిస్తే ఇది సాధ్యం అయ్యేది కాదని ఆయన అన్నారు. నిర్మాతల ఆర్థిక సమస్యలు, ప్రణాళిక లోపాలను కూడా తన ఆలస్యానికి ఆపాదించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విమానాశ్రయంలో షూటింగ్ ఉదయం 9:30కి ఉన్నా, తాము గంటన్నర ముందు నుంచే కారులో సిద్ధంగా ఉన్నా, నిర్వాహకుల పర్మిషన్ సమస్యల వల్ల షూటింగ్ ఆలస్యమైన సంఘటనలను కూడా ఆయన ఉదహరించారు. కొందరు తన సొంత లోపాలను కప్పిపుచ్చుకోవడానికి తనపై ఆరోపణలు చేశారని రాజశేఖర్ దీటుగా బదులిచ్చారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.