Reading Time: < 1 minute
చూశారా ఈ అద్భుతం.. శివయ్యపైకి ఎక్కి కంఠాభరణంగా నాగుపాము.. అరగంటపాటు..

తెలంగాణలో నిర్మాణ దశలో ఉన్న శివుడి విగ్రహంపై నాగుపాము ప్రత్యక్షమవడం స్థానికంగా ఆసక్తికరంగా మారింది. విగ్రహం చుట్టూ తిరుగుతూ, కొంతసేపు శివుడి మెడ వరకు వెళ్లిన పాము.. సుమారు అరగంట పాటు అక్కడే ఉండి ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా వెళ్లిపోయింది. ఈ ఘటనను స్థానికులు దైవ మహిమగా భావిస్తున్నారు.

జగిత్యాల మండలం మోరేపల్లి గ్రామంలో నూతనంగా శివాలయ నిర్మాణం జరుగుతోంది. ఆలయ ప్రాంగణంలో భారీ పరిమాణంలో శివుడి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. విగ్రహ నిర్మాణ పనులు కొనసాగుతున్న సమయంలో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ.. ఓ భారీ నాగుపాము అక్కడికి చేరుకుంది.

విగ్రహం వద్దకు వచ్చిన పాము.. క్రమంగా శివుడి విగ్రహంపైకి ఎక్కింది. తొలుత విగ్రహం చుట్టూ తిరిగిన నాగుపాము.. అనంతరం శివుడి మెడ వరకు వెళ్లింది. కొంతసేపు విగ్రహంపైనే ఉండి.. రెండుసార్లు పడగ విప్పినట్లు స్థానికులు తెలిపారు. సుమారు 30 నిమిషాల పాటు అక్కడే ఉన్నప్పటికీ.. ఎవరికీ ఎలాంటి హాని చేయలేదు.

పాము విగ్రహంపై ఉన్న విషయం తెలియడంతో గ్రామస్థులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఈ దృశ్యాలను పలువురు తమ సెల్‌ఫోన్లలో వీడియోలు, ఫొటోలు తీశారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

శివుడి విగ్రహంపై నాగుపాము ప్రత్యక్షం కావడాన్ని స్థానికులు భక్తి భావంతో చూస్తున్నారు. ఆలయ నిర్మాణ సమయంలో ఇలా పాము రావడం శుభ పరిణామమని పలువురు భావించారు. పాము అక్కడి నుంచి వెళ్లిపోయిన అనంతరం స్థానికులు శివుడి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఘటనతో నిర్మాణంలో ఉన్న శివాలయం వద్ద భక్తుల సందడి నెలకొంది.

వీడియో దిగువన చూడండి…