Reading Time: < 1 minute

పెద్దపల్లిలో పీఎం సేతు ఐటీఐ క్లస్టర్ ఏర్పాటు చేయాలి:కేంద్ర మంత్రి కుమారస్వామికి మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ విజ్ఞప్తి

Caption of Image.

న్యూఢిల్లీ, వెలుగు:  పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో పీఎం సేతు ఐటీఐ క్లస్టర్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కోరారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌‌‌‌డీ కుమారస్వామిని ఎంపీ గడ్డం వంశీకృష్ణతో కలిసి కలిశారు. 

ఈ సందర్భంగా పెద్దపల్లిలో పీఎం సేతు ఐటీఐ క్లస్టర్ ఏర్పాటు చేయాలని వినతిపత్రం ఇచ్చారు. తర్వాత మంత్రి వివేక్ మీడియాతో మాట్లాడుతూ పీఎం సేతు పథకం అమలులో తెలంగాణ ముందంజలో ఉందన్నారు. పెద్దపల్లి పారిశ్రామిక, మైనింగ్ ప్రాంతం కావడంతో ఇక్కడ ఐటీఐ క్లస్టర్ అవసరం చాలా ఉందన్నారు. 

ఎన్‌‌‌‌ఎండీసీ ఆధ్వర్యంలో క్లస్టర్ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోరినట్లు చెప్పారు. మైనింగ్, మెటల్స్, ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్ రంగాలకు అవసరమైన కోర్సులు, శిక్షణ ఇవ్వాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. ఒక ప్రభుత్వ ఐటీఐని పీఎం సేతు హబ్‌‌‌‌గా, నియోజకవర్గంలోని మిగతా ఐటీఐలను స్పోక్స్‌‌‌‌గా గుర్తించాలని కోరినట్లు చెప్పారు. 

క్లస్టర్ ఏర్పాటుతో స్థానిక యువతకు మంచి శిక్షణ, పరిశ్రమల్లో పని చేసే అవకాశం వస్తుందన్నారు. ఇండస్ట్రీ ఎక్స్‌‌‌‌పోజర్, అప్రెంటిస్‌‌‌‌షిప్, ఆన్‌‌‌‌ది జాబ్ ట్రైనింగ్‌‌‌‌తో పాటు ప్లేస్‌‌‌‌మెంట్ అవకాశాలు కూడా కల్పించాలని కోరినట్లు తెలిపారు. 

ఎన్‌‌‌‌ఎండీసీతో పాటు సంబంధిత కేంద్ర శాఖలు, అధికారులతో సమన్వయం చేసి ఐటీఐ క్లస్టర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశామన్నారు. తమ విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి కుమారస్వామి సానుకూలంగా స్పందించారని మంత్రి వివేక్ తెలిపారు.
 

©️ VIL Media Pvt Ltd.