Reading Time: 1 minute

నిన్ను, నీ భార్యని చంపేస్తాం: సౌరవ్ గంగూలీ దంపతులకు ప్రాణహాని.. రంగంలోకి పోలీసులు!

Caption of Image.

Ganguly Death Threat: భారత క్రికెట్ దిగ్గజం, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (CAB) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ దంపతులకు హత్య బెదిరింపులు రావడం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. తమ ప్రాణాలకు తీవ్ర హాని ఉందంటూ ఆగస్టు 10వ తేదీన వచ్చిన రెండు లేఖలతో గంగూలీ మేనేజర్ కోల్‌కతా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే గత 6 నెలలుగా గంగూలీ ఆఫీస్‌కు అనుమానాస్పద లేఖలు వస్తున్నప్పటికీ, మొదట వాటిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.. కానీ సోమవారం (ఆగస్టు 10న) వచ్చిన రెండు లేఖలతో కాస్త భయంకర పరిస్థితి నెలకొందన్నారు. ఆ లేఖల్లో సౌరవ్ గంగూలీతో పాటు ఆయన భార్య డోనా గంగూలీని హతమారుస్తామని, వారి ఆత్మీయులకు కూడా చంపేస్తామని హెచ్చరించారు. దీంతో వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి రంగంలోకి దిగారు.

కొరియర్ ఏజెన్సీలపై పోలీసుల దృష్టి: 
కోల్‌కతా పోలీసులు ఈ సంచలన లేఖల మూలాలను వెలికితీసేందుకు వేగంగా విచారణ చేపట్టారు. లేఖలను గంగూలీ ఆఫీస్‌కు చేరవేసిన కొరియర్ కంపెనీ ప్రతినిధులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. పార్సెల్ ఎక్కడి నుంచి బుక్ అయిందనే వివరాలను సేకరిస్తున్నారు. నార్త్ 24 పరగణాల జిల్లాలోని బెల్ఘరియా ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తికి దీంతో ప్రమేయం ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.

సిమ్ కార్డ్ లొకేషన్ ఆధారంగా దర్యాప్తు: 
విచారణ వేగవంతం చేసే క్రమంలో పోలీసులకు ఒక మొబైల్ నంబర్ లభించింది. సదరు అనుమానితుడు ఉపయోగిస్తున్న సిమ్ కార్డ్ కదలికలను పోలీసులు నిరంతరం ట్రాక్ చేస్తున్నారు. కొరియర్ సర్వీస్ సిబ్బంది ఇచ్చిన సమాచారం, కాల్ డేటా ఆధారంగా నిందితుడి పూర్తి వివరాలు, ఆచూకీ కనుగొనేందుకు కోల్‌కతా పోలీసులు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. 

©️ VIL Media Pvt Ltd.