
డీజిల్‌లో ఇథనాల్‌ను కలపడంతో దాని ‘ఫ్లాష్ పాయింట్’ (మండే ఉష్ణోగ్రత) పడిపోతోందని, సేఫ్టీ స్టాండర్డ్స్‌ను ఈ ఇంధనం అందుకోలేకపోతోందని కేంద్ర మంత్రి సురేశ్ గోపి పార్లమెంట్‌లో స్పష్టం చేశారు. ఈ సమస్యను పరిష్కరించే వరకు డీజిల్‌లో ఇథనాల్ కలపడాన్ని ఆపేస్తున్నామని తెలిపారు.
న్యూఢిల్లీ: డీజిల్‌లో ఇథనాల్‌ను కలపడంతో దాని ‘ఫ్లాష్ పాయింట్’ (మండే ఉష్ణోగ్రత) పడిపోతోందని, సేఫ్టీ స్టాండర్డ్స్‌ను ఈ ఇంధనం అందుకోలేకపోయిందని కేంద్ర పెట్రోలియం, నేచురల్ గ్యాస్ శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి పార్లమెంట్‌లో స్పష్టం చేశారు. ఈ టెక్నికల్ సమస్యను పరిష్కరించేంత వరకు డీజిల్‌లో ఇథనాల్ కలపడం సాధ్యపడదని ఆయన రాతపూర్వక సమాధానంలో తెలిపారు.
‘‘ప్రభుత్వ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీలు) తమ రీసెర్చ్ సెంటర్లు, గుర్తింపు పొందిన ల్యాబ్‌లు, వాహన తయారీదారులతో కలిసి నిర్వహించిన పరిశోధనల్లో సేఫ్టీ ప్రమాణాలకు అనుగుణంగా ఇథనాల్ బ్లెండెడ్ డీజిల్ లేదని తేలింది. ఫ్లాష్ పాయింట్ తగ్గడంతో నిల్వ, రవాణా, వినియోగ సమయాల్లో మంటలు అంటుకునే ప్రమాదం ఉంది”అని ఆయన వివరించారు.
మరోవైపు పెట్రోల్‌లో ఇథనాల్ బ్లెండింగ్‌ను ప్రస్తుతానికి 20 శాతం (ఈ20) దాటి పెంచే ఆలోచన ఏదీ లేదని, రాబోయే రోజుల్లో దీనిపై నిర్ణయం తీసుకుంటామని, అది కూడా పెద్ద మొత్తంలో పరీక్షలు జరిపాక, వాహన తయారీదారులతో సంప్రదింపుల తర్వాతనే ఉంటుందని గోపి వెల్లడించారు.
దేశంలో అదనంగా ఉన్న ఇథనాల్ ఉత్పత్తిని వినియోగించుకోవడానికి, ఎల్పీజీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ఇథనాల్‌ను వంట ఇంధనంగా మార్చేందుకు ఇండియన్ ఆయిల్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ కలిసి రీసెర్చ్ చేస్తున్నాయని తెలిపారు.