Reading Time: < 1 minute

10 వేల ఉద్యోగాల కోసం సీవీలు పంపాలి.. యువతకు ప్రశాంత్ కిషోర్ బంపర్ ఆఫర్.. 

Caption of Image.

బిహార్ రాజకీయాలో సంచలనం సృష్టించి, బంకిపూర్ ఉపఎన్నికలో చరిత్రాత్మక విజయం సాధించిన జన సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్.. ఇప్పుడు అక్కడి యువత కోసం మరో కీలక ప్రకటన చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నియోజకవర్గంలోని 10 వేల మంది యువతకు ఉద్యోగాలు కల్పించే దిశగా కీలక అడుగు వేశారు.

బంకిపూర్ ఉపఎన్నికలో ఘన విజయం సాధించిన తర్వాత, నియోజకవర్గంలో కృతజ్ఞతా యాత్ర నిర్వహించిన ప్రశాంత్ కిషోర్ స్థానిక ప్రజలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని చదువుకుని ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న యువత వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. అర్హులైన యువకుల కుటుంబాలు తమ పిల్లల బయోడేటా లేదా సీవీలను తన కార్యాలయానికి పంపాలని కోరారు.

దేశవ్యాప్తంగా ఉన్న తన పరిచయాలు, వివిధ కార్పొరేట్ సంస్థల నెట్‌వర్క్‌ను ఉపయోగించి రానున్న ఒకటి రెండు సంవత్సరాలలో కనీసం 10 వేల మంది యువతకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తాను తీసుకుంటానని పీకే స్పష్టం చేశారు. అయితే ఇది ప్రభుత్వ ఉద్యోగం కాదని, అవసరమైతే కొందరు ఉద్యోగాల కోసం బిహార్ వెలుపలి ప్రాంతాలకు కూడా వెళ్లాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. జన సురాజ్ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రం రాష్ట్రంలోనే ఉపాధి అవకాశాలు సృష్టిస్తామని హామీనిచ్చారు.

ఇదిలా ఉంటే, ఇటీవలి బాంకిపూర్ అసెంబ్లీ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థిపై ప్రశాంత్ కిషోర్ దాదాపు 19 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. బీజేపీకి కంచుకోటగా ఉన్న ఈ స్థానంలో పీకే విజయం సాధించడం బిహార్ రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశమైంది. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం నియోజకవర్గ అభివృద్ధితో పాటు ఉపాధి కల్పనపై ఆయన ఇప్పుడు ప్రత్యేక దృష్టి పెట్టారు.

©️ VIL Media Pvt Ltd.