Reading Time: 2 minutes
Off The Record Over Pocharams U Turn

ఆ మాజీ మంత్రి కమ్‌ మాజీ స్పీకర్‌ కమ్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే స్వరం మారిపోయిందా? కారు జర్నీ సరిపడక కిందకి దిగేసి… చేతిలో చెయ్యేసి నడుస్తున్నా…. ఇప్పుడా నడక కూడా భారంగా మారిందా? అబ్బా.. మళ్ళీ కారెక్కితే బాగుండునని అనుకుంటున్నారా? లోపల సీట్లు ఖాళీ లేవు, ఇప్పుడు డోర్‌ తీసే ప్రసక్తే లేదని అంటున్నా.. ఫీల్ మై లవ్ అంటూ.. వన్ సైడ్ ప్రేమ గీతం ఆలపిస్తున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? కాంగ్రెస్‌ మీద అసంతృప్తికి కారణం ఏంటి?

పార్టీ మార్పునకు సంబంధించి కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తాజాగా చేసిన కామెంట్స్ పొలిటికల్ సర్కిల్స్‌లో వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా… ఆయన మాటలు హస్తం పార్టీలో మంటలు పుట్టిస్తే.. గులాబీ కేడర్‌లోనూ గుబులు రేపుతున్నాయట. రాజకీయాల్లో తల పండిన మాజీ స్పీకర్‌ మాటల వెనక తప్పకుండా పొలిటికల్ స్ట్రాటజీ ఉంటుందని విశ్లేషిస్తున్నారు ఆయన గురించి బాగా తెలిసిన వాళ్ళు. అంత సీనియర్ నేత… ప్రభుత్వం మీద ఫైరైతే నిధులు రాబట్టవచ్చని భావిస్తుండవచ్చన్నది ఒక చర్చ. మరి కొందరు మాత్రం… గెలిచిన పార్టీకి తిరిగి దగ్గరయ్యేందుకే గులాబీ జపం చేస్తున్నారని, ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ను పొగిడేస్తున్నారని అంచనా వేస్తున్నారు. క్యాడర్ చేజారిపోకుండా వేస్తున్న పొలిటికల్ స్టంట్‌గా కొట్టి పారేసేవాళ్ళు సైతం లేకపోలేదు.

 

బాన్సువాడ ఎమ్మెల్యే యూ టర్న్ తీసుకున్నారన్న చర్చ ఓవైపు జరుగుతుండగానే… ఆయనకు పార్టీలోకి నో రీ ఎంట్రీ బోర్డు పెట్టేశారన్న మాటలు కూడా గట్టిగానే ఉన్నాయి. అదే విషయాన్ని ఇటీవల పార్టీ కార్యకర్తల సమావేశంలో చెప్పారట మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి. పైగా అది కేసీఆర్‌ మాట అన్నట్టు సమాచారం. మరోవైపు బాన్సువాడ గులాబీ పార్టీలో ఇటీవల చేరికలు జరిగాయి. మరి కొందరు కూడా గులాబీ కండువా కప్పుకోవచ్చని చెప్పుకుంటున్నారు. వాటికి తోడు బీసీ, లోకల్ , మార్పు నినాదాలు జనాల్లోకి బలంగా వెళ్తుండటంతో శ్రీనివాసరెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసి ఉండవచ్చని అంటున్నారు. గత ఏప్రిల్‌లో ప్రభుత్వ పెద్దలు, అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే…. తాజాగా మరోసారి మంత్రులను టార్గెట్‌ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

మంత్రులు తన ఫోన్ ఎత్తడం లేదని, కొందరు దరిద్రుల వల్లే పార్టీ మారాల్సి వచ్చిందంటూ… పరోక్షంగా మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డిపై విరుచుకుపడ్డట్టు అంచనా వేస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని పార్టీ మారాల్సి వచ్చిందంటూ క్యాడర్‌కు వివరణ ఇచ్చారాయన. అలాగే… కాంగ్రెస్‌ పెద్దలకు కాలిపోయే వ్యాఖ్యలు కూడా చేశారు. కేసీఆర్‌ హయాంలోనే నియోజకవర్గం అభివృద్ధి చెందిందని, అన్నంపెట్టిన వాళ్ళను ఎప్పటికీ మర్చిపోలేనని అనడంతో సార్‌ చూపు మళ్లీ గులాబీ తోట వైపు మళ్ళినట్టు కనిపిస్తోందన్న చర్చలు నడుస్తున్నాయి. అలాగే… నేను జాతీయ జెండాను మాత్రమే కప్పుకున్నాను, కాంగ్రెస్‌ జెండాను కాదని చెప్పడం కాక రేపుతోంది. ఇక ఇదే సమయంలో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి గులాబీ పెద్దలకు టచ్ లోకి వెళ్లినట్లు ప్రచారం కూడా ఉంది. అందుకే అలర్ట్‌ అయిన పెద్దాయన…మరోసారి స్వరం సవరించుకున్నారా అన్న డౌట్స్‌ ఉన్నాయి.

ఐతే లక్ష్మీ పుత్రుడు అంటూ నాడు బాన్సువాడలో నిధుల వరద పారించిన గులాబీ బాస్ కేసీఆర్‌.. పోచారం వ్యవహరించిన తీరుపై ఇప్పటికీ కోపంగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే తాజా వ్యాఖ్యలతో గులాబీ క్యాడర్‌లో కూడా రీ ఎంట్రీ గుబులు పట్టుకుందట. కానీ బీఆర్‌ఎస్‌ నేతలు మాత్రం… పోచారంను పార్టీలోకి రానిచ్చే ప్రసక్తి లేదంటూ ప్రశాంత్‌రెడ్డి మాట్లాడిన వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో… బాన్సువాడ ప్రస్తుతం తెలంగాణ పొలిటికల్ హాట్ అయింది. ఇదే సమయంలో పోచారం ఇప్పట్లో పార్టీ మారకపోవచ్చని అంటున్నాయి ఆయన సన్నిహిత వర్గాలు. అటు ఏనుగు రవీందర్‌రెడ్డి కూడా తాను గులాబీ గూటికి వెళ్తానని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించడం లేదు. బాన్సువాడలో బీసీ నినాదంతో ముందుకు వెళ్లాలని బీఆర్‌ఎస్‌ నిర్ణయించడంతో… ఏనుగు తన పాత నియోజకవర్గానికి వెళ్తారా అనే చర్చ కూడా మొదలైంది. ఇలాంటి రాజకీయ వాతావరణంలో పోచారం మాటలు ఎలాంటి మంటలు పుట్టిస్తాయో చూడాలి.