
అనుమానం పెనుభూతమైంది.. ఏడేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యపైనే అనుమానం పెంచుకున్న ఒక భర్త, ఆమెను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఆపై ఏమీ తెలియనట్లు ప్రమాదవశాత్తు జరిగిందంటూ నాటకమాడాడు. అయితే ఫోరెన్సిక్ ఆధారాలతో పోలీసులు రంగంలోకి దిగడంతో ఆ భర్త చేసిన కిరాతకం బయటి ప్రపంచానికి తెలిసింది. ఉత్తరప్రదేశ్ ఫతేపూర్ జిల్లా నాసిర్‌పూర్ మొహల్లాలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. అల్లీపూర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో దిలీప్ యాదవ్ అనే వ్యక్తి అసిస్టెంట్ టీచర్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్య శాలిని ఒక ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా వర్క్ చేస్తుంది. వీరిద్దరూ 2017 డిసెంబర్ 3న ఇరు కుటుంబాలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత కొన్ని రోజులు సంతోషంగా ఉన్నప్పటికీ, నాసిర్‌పూర్ మొహల్లాలోని అద్దె ఇంట్లో నివాసముంటున్న సమయంలో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి.
అనుమానం.. పెనుభూతం..
తన భార్య శాలినికి వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందనే బలమైన అనుమానంతో దిలీప్ తరచూ ఆమెతో గొడవపడేవాడు. ఆ క్రమంలోనే ఆగస్టు 8వ తేదీ ఉదయం భార్యను కడతేర్చాలని పథకం వేశాడు. ఈ కుట్రలో తన ఇద్దరు సోదరుల సహాయం కూడా తీసుకున్నాడు. ఆగస్టు 8న ఉదయం ఘర్షణ తీవ్రం కావడంతో దిలీప్ విచక్షణ కోల్పోయాడు. ఇంట్లో ఉన్న ప్రెజర్ కుక్కర్ మూతతో శాలిని తలపై బలమైన గాయం చేశాడు. దీంతో ఆమె తీవ్ర రక్తస్రావంతో కిందపడిపోయింది. అంతటితో ఆగకుండా ఆమెను బాత్‌టబ్‌లోని నీళ్లలో ముంచి ఊపిరి ఆడకుండా చేసి అత్యంత క్రూరంగా ఊపిరి తీశాడు. హత్య చేసిన అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు దిలీప్ సుమారు 20 నిమిషాల పాటు వీధుల్లో తిరిగాడు. ఆ తర్వాత తన సోదరులకు ఫోన్ చేసి, భార్య హఠాత్తుగా స్పృహతప్పి పడిపోయిందని కల్పిత కథ అల్లి ఆసుపత్రికి తరలించాడు. కానీ పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు.
నాటకానికి తెర దించిన పోలీసులు
శాలిని మృతదేహంపై ఉన్న గాయాలు, సంఘటనా స్థలంలో పరిస్థితులు అనుమానాస్పదంగా ఉండటంతో వైద్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆగస్టు 9న శాలిని కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫోరెన్సిక్ బృందాలు క్లూస్ సేకరించగా.. దిలీప్ ఆడిన ప్రమాదపు నాటకం వెలుగులోకి వచ్చింది. భార్యపై ఉన్న అనుమానంతోనే తన సోదరులతో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసుల విచారణలో అంగీకరించాడు. దీంతో పోలీసులు ప్రధాని నిందితుడైన దిలీప్ యాదవ్‌ను ఆగస్టు 12న అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం అతనికి న్యాయస్థాన రిమాండ్ విధించింది.